శంషాబాద్‌లో దిగిన బ్రిటన్ సైనిక విమానాలు

  • నిన్న ఎయిర్‌‌పోర్టులో ల్యాండ్ అయిన 4 టైఫూన్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్‌లు
  • ఎయిర్‌‌బస్ 330 విమానం కూడా
  • హర్షం వ్యక్తం చేసిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం బ్రిటన్‌కు రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆతిథ్యమిచ్చింది. రక్షణ అవసరాలకు వినియోగించే టైఫూన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు నిన్న శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. నాలుగు టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు మల్టీరోల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌బస్‌ 330ఎంఆర్టీటీ విమానం కూడా శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ప్రపంచంలో మొట్టమొదటి స్వతంత్ర వైమానిక దళంగా రాయల్ ఎయిర్‌‌ ఫోర్స్‌కు పేరుంది. ఇందులో టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎయిర్‌బస్‌ కీలకంగా ఉన్నాయి.

బ్రిటన్ రక్షణ అవసరాలకు ఉపయోగపడుతున్న టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎయిర్‌బస్‌లకు గాలిలో ఉండగానే ఒక విమానం నుంచి మరో దాంట్లోకి ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి విమానాలు తమ ఎయిర్‌‌పోర్టుకు రావడంపై శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి విమానాలకు సులభంగా నిర్వహించే సామర్థ్యం, సంసిద్ధత తమ సొంతం అని తెలిపింది. పగటి పూటే వచ్చి రాత్రి వరకూ విమానాశ్రయం రన్‌వేపై ఉన్న ఈ విమానాల ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్‌‌)లో షేర్ చేసింది.


More Telugu News