ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదు: కెనడాతో వివాదంపై మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

  • భావ ప్రకటనా స్వేచ్ఛపై ఇతర దేశాల పాఠాలు భారత్‌కు అవసరం లేదన్న మంత్రి జైశంకర్
  • కెనడాలో అతివాదులు ఆశ్రయం పొందుతుండటం ఆందోళనకరమని వ్యాఖ్య
  • కెనడా ప్రధాని ఆరోపణలపై కచ్చితమైన ఆధారాలు చూపించమని కోరినట్టు వెల్లడి
  • కెనడాలో భారత దౌత్యవేత్తలు తమ భద్రతపై ఆందోళన చెందే పరిస్థితులు ఉన్నాయన్న మంత్రి
భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హింసకు దారి తీయకూడదంటూ కెనడాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి జైశంకర్ శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.

‘‘ఈ విషయాన్ని నేను అమెరికన్లు, కెనేడియన్ల వద్ద కూడా స్పష్టంగా పేర్కొన్నాను. మాది ప్రజాస్వామిక దేశం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ హింసకు దారి తీయకూడదని మేము స్పష్టంగా చెబుతున్నాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

భారత్‌ ప్రస్తుతం ఉన్న స్థితిలో ఇతర దేశాలు ఉంటే ఎలా స్పందించేవని ఓ విలేకరి ప్రశ్నకు మంత్రి జైశంకర్ ఎదురు ప్రశ్న వేశారు. ‘‘మీ దౌత్యవేత్తలు, ఎంబసీ, ప్రజలకు బెదిరింపులు ఎదురవుతుంటే మీరేం చేస్తారు?’’ అని సూటి ప్రశ్న సంధించారు. 

కెనడాలో అతివాదులు ఆశ్రయం పొందుతుండటం ఆందోళనకరమని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని అమెరికా దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ‘‘ కెనడా ప్రధాని కొన్ని ఆరోపణలు చేశారు. తొలిసారి వ్యక్తిగత సంభాషణల్లో , ఆ తరువాత బహిరంగంగా ఈ ఆరోపణలు చేశారు. రెండు సందర్భాల్లోనూ మేము మా వైఖరిని స్పష్టం చేశాము. ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న కచ్చితమైన ఆధారాలను భారత్ చూడాలని కెనడా ప్రభుత్వం కోరుకుంటే అందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పాం’’ అని మంత్రి వివరించారు. 

‘‘ ఈ అతివాదం కొంతకాలంగా నిద్రాణస్థితిలో ఉంది. కానీ కెనడా మెతక వైఖరి కారణంగా కొన్ని ఏళ్ల నుంచీ మళ్లీ బుసలుకొట్టడం ప్రారంభించింది. అక్కడి రాజకీయాల కారణంగా కెనడా ప్రభుత్వం అతివాదుల కార్యకలాపాలకు అవకాశం ఇచ్చింది. అమెరికాకు కెనడా భిన్నమైన దేశంగా కనిపించొచ్చు. మా వరకూ చూస్తే వ్యవస్థీకృత నేరసామ్రాజ్యం, వేర్పాటువాదం, హింత, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా కలిగలిసిన ఓ విషపూరిత మిశ్రమానికి కెనడా కేంద్రంగా మారింది. ఈ సమస్యలు ట్రూడో ప్రభుత్వానికి ముందు నుంచీ ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు.


More Telugu News