కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ వ్యవహారం: ఏదైనా ఉంటే పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోవాలన్న కేజ్రీవాల్!

  • మాదక ద్రవ్యాల ఆరోపణలపై పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా అరెస్ట్
  • కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం
  • I.N.D.I.A. కూటమి పట్ల తాము పూర్తి నిబద్ధతతో ఉన్నామన్న కేజ్రీవాల్
  • పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు తన వద్ద లేవన్న ఢిల్లీ సీఎం
మాదకద్రవ్యాల ఆరోపణలపై ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా అరెస్ట్‌పై పంజాబ్‌లో తమ పార్టీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రవాగ్వాదం నెలకొన్నప్పటికీ ప్రతిపక్ష I.N.D.I.A. కూటమితో తాము కలిసే ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కూటమి పట్ల తాము పూర్తి నిబద్ధతతో ఉన్నామన్నారు. కూటమికి దూరంగా వేరే దారిలో వెళ్లేది లేదన్నారు. డ్రగ్స్ కేసులో నిన్న పంజాబ్ పోలీసులు ఒక కాంగ్రెస్ నేతను అరెస్ట్ చేసినట్లుగా తాను విన్నానని, ఇందుకు సంబంధించి వివరాలు తన వద్ద లేవన్నారు.

ఈ అంశంపై ఏదైనా ఉంటే పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోవాలని సూచించారు. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అక్కడ డ్రగ్స్ సమస్యను తొలగించే ప్రక్రియలో నిమగ్నమైందన్నారు. ఈ పోరాటంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. 

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు (2015)లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఎమ్మెల్యేను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని కాంగ్రెస్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో సుఖ్‌పాల్ హస్తం ఉన్నందునే అరెస్ట్ చేశామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో I.N.D.I.A. కూటమిపై కేజ్రీవాల్ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.


More Telugu News