ఇన్ కమ్ ప్రూఫ్ లేకపోయినా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు..!

  • కస్టమర్ చెల్లింపులు, ఇతర డేటాను విశ్లేషిస్తున్న బ్యాంక్ లు
  • వీటి ఆధారంగా క్రెడిట్ కార్డుల మంజూరు
  • ఫిక్స్ డ్ డిపాజిట్ పై క్రెడిట్ కార్డు తీసుకునే సదుపాయం
క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోరుకు తోడు, మంచి ఆదాయ మార్గం కూడా ఉండాలి. చాలా మందిలో ఇదే అభిప్రాయం ఉంటుంది. కానీ, ఇది గతంలో. ఇప్పుడు ఇవేమీ లేకపోయినా క్రెడిట్ కార్డు సులభంగానే పొందొచ్చు. 

క్రెడిట్ కార్డుకు ఉద్యోగం, ఆదాయ రుజువులు అక్కర్లేదు. ఆదాయ రుజువులు, వేతన ఖాతా లేనప్పుడు.. ఇతర మార్గాల ద్వారా ఆదాయ వనరులు తెలుసుకుని క్రెడిట్ కార్డులను సంస్థలు మంజూరు చేస్తున్నాయి. సంబంధిత వ్యక్తి అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే, వాటిని తిరిగి ఎలా చెల్లించారో చూస్తాయి. సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వివరాలు చూస్తాయి. క్రెడిట్ బ్యూరోలో మంచి స్కోరు చెల్లింపుల చరిత్ర ఉంటే బ్యాంకులు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నాయి. 

బ్యాంక్ స్టేట్ మెంట్, ఫామ్ 26 ఏఎస్, జీఎస్ టీ ఆర్ -3బీ (వ్యాపారులు) చూసి కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఈ వివరాలు చూసే ముందు కస్టమర్ల సమ్మతిని బ్యాంకులు తీసుకుంటున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే సంబంధిత కస్టమర్ కు బ్యాంక్ తో ఉన్న అనుబంధం ఏపాటిది? ఖర్చు చేసే తీరు ఎలా ఉంది? యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ స్కోరు, ఇతర డేటా ఆధారంగా కార్డులు మంజూరు చేస్తోంది. అంటే ఎన్నో మార్గాల ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి కార్డులను ఇస్తున్నాయి.

ఒకవేళ క్రెడిట్ కార్డు అభ్యర్థనను బ్యాంకులు తిరస్కరిస్తే నిరాశపడక్కర్లేదు. బ్యాంకులో కొంత ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే.. ఆ డిపాజిట్ పై క్రెడిట్ కార్డు పొందొచ్చు. దీనికి ఎలాంటి ఆదాయ పత్రాలు, వేతన ఖాతాలు, క్రెడిట్ స్కోరు కూడా అవసరం లేదు. తీసుకునే క్రెడిట్ కార్డులో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తే ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు.


More Telugu News