భారత దౌత్యవేత్తను చంపాలంటూ గురుద్వారాలపై పోస్టర్లు

  • తొలగించాలని ఆదేశించిన కెనడా అధికారులు
  • లెక్క చేయని గురుద్వారాల నిర్వాహకులు
  • ఇప్పటికీ కొన్ని చోట్ల దర్శనమిస్తున్న పోస్టర్లు
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలో కెనడా సర్కారులో చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనంగా.. ఇప్పటికీ కెనడాలోని పలు గురుద్వారాల వద్ద భారత దౌత్యవేత్తను అంతం చేయాలంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 18న ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గుర్తు తెలియని వ్యక్తులు చంపిన తర్వాత.. ఈ విషయంలో భారత్ ప్రమేయం ఉందంటూ, భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం తెలిసిందే.

ఈ పరిణామం తర్వాత భారత దౌత్యవేత్తలను అంతం చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఇవి ఆన్ లైన్ లోనూ దర్శనమిచ్చాయి. గురుద్వారాల గోడలపై అంటించడం కూడా కనిపించింది. నిజ్జర్ హత్య ఘటన తర్వాత భారత్-కెనడా మధ్య సంబంధాలు మరింత వేడెక్కడం తెలిసిందే. భారత్ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందంటూ భారత సర్కారు నిరసన వ్యక్తం చేసింది. 

దీంతో గురుద్వారాల వద్ద అంటించిన పోస్టర్లను తొలగించాలంటూ అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొన్నింటిని తొలగించి, కొన్నింటిని ఉద్దేశపూర్వకంగా అలానే కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ గురుద్వారాల వెనుక గోడలపై ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. భారత దౌత్యవేత్తల ఫొటోలు వేసి, అంతం చేయాలంటూ దానిపై రాసి ఉంది. నిజ్జర్ ఫొటో సైతం పోస్టర్లలో ఉంది.


More Telugu News