ఆ రైలు ప్లాట్‌ఫాంపైకి ఎలా దూసుకెళ్లిందో కారణం తెలిసింది.. దర్యాప్తులో విస్తుపోయే విషయాల వెల్లడి!

  • మంగళవారం రాత్రి షుకుర్ బస్తీ నుంచి మధుర చేరుకున్న రైలు
  • ప్రయాణికులు దిగి వెళ్లిపోగానే ప్లాట్‌ఫాం ఎక్కేసిన వైనం
  • మద్యం మత్తులో ఫోన్ చూసుకుంటూ ఇంజిన్‌లో ఉన్న సిబ్బంది
  • థ్రోటల్‌పై బ్యాగ్ పెట్టగానే ముందుకు దూకిన రైలు
ఉత్తరప్రదేశ్‌లోని మధుర రైల్వేస్టేషన్‌లో ఇటీవల ఓ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) రైల్వే ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన ఘటనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. షుకుర్ బస్తీ నుంచి బయలుదేరిన రైలు మంగళవారం రాత్రి 10.49 గంటల సమయంలో మధుర రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు అకస్మాత్తుగా ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. 

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రైల్వే అధికారులు ప్రమాద కారణాన్ని తాజాగా వెల్లడించారు. ఆ సమయంలో రైలు ఇంజిన్‌లో ఉన్న సచిన్ మద్యం మత్తులో ఉండి ఫోన్ చూసుకుంటూ తన బ్యాగ్‌ను ఇంజిన్ థ్రోటల్‌పై పెట్టాడు. దీంతో రైలు ఒక్కసారిగా వేగంగా కదిలి ముందుకు దూకినట్టు దర్యాప్తు నివేదిక పేర్కొంది. 

సచిన్ మాత్రం తన తప్పు ఏమీ లేదని, లోకోపైలట్ గోవింద్ హరిశర్మ ఇంజిన్ ఆఫ్ చేయకుండా తనకంటే ముందే రైలు దిగి వెళ్లిపోయాడని ఆరోపించాడు. ఇంజిన్ ఆన్‌లో ఉండడంతో తాను బ్యాగ్ పెట్టగానే థ్రోటల్ కదిలి రైలు ముందుకు దూసుకెళ్లిందని పేర్కొన్నాడు. తాను ఎమర్జెన్సీ బ్రేకులు వేసే లోపే రైలు స్టాపర్, పిల్లర్లను ఢీకొని ప్లాట్‌ఫాంపైకి ఎక్కేసినట్టు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి సచిన్, లోకోపైలట్ గోవింద్ హరిశర్మ సహా మొత్తం ఐదుగురిని అధికారులు సస్పెండ్ చేశారు.


More Telugu News