చుట్టూ సముద్రం... మధ్యలో రెస్టారెంట్... ఎక్కడో చూడండి!

  • టాంజానియాలోని జాంజిబార్ వద్ద రాక్ రెస్టారెంట్
  • సముద్రం మధ్యలో పెద్ద బండరాయి
  • బండరాయిపై రెస్టారెంట్ ఏర్పాటు
  • భారీగా తరలి వస్తున్న పర్యాటకులు
  • పసందైన వంటకాలతో నోరూరించే రెస్టారెంట్
ఆఫ్రికా దేశం టాంజానియాకు అందమైన సముద్ర తీరప్రాంతం ఉంది. ఇక్కడి జాంజిబార్ ద్వీప సముదాయానికి ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. తెల్లని ఇసుకతో కూడిన బీచ్ లు, స్వచ్ఛంగా ఆహ్లాదకరంగా కనిపించే హిందూ మహాసముద్ర జలాలతో జాంజిబార్ ప్రముఖ టూరిస్టు స్పాట్ గా ప్రఖ్యాతిగాంచింది. 

అయితే, జాంజిబార్ లో మరో ప్రధాన ఆకర్షణ కూడా ఉంది. అదే... రాక్ రెస్టారెంట్. ఇది సముద్రం మధ్యలో ఉంటుంది. చుట్టూ సముద్రం... మధ్యలో ఓ పెద్ద బండరాయి... దానిపై రెస్టారెంట్!... సీనరీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. 

ఈ రాక్ రెస్టారెంట్ సముద్ర తీరానికి చాలా దగ్గర్లోనే ఉంటుంది కాబట్టి, ఒక్కోసారి సముద్రపు నీటి మట్టం తగ్గినప్పుడు కొద్దిపాటి నీటిలో నడుచుకుంటూ వెళ్లొచ్చట. సాధారణంగా అయితే ఈ రెస్టారెంట్ కు వెళ్లడానికి బోటు సదుపాయం ఉంటుంది. 

టాంజానియా వచ్చే విదేశీ పర్యాటకులు రాక్ రెస్టారెంట్ ను తప్పక సందర్శిస్తారు. ఇక్కడి రుచులను ఆస్వాదిస్తూ, ప్రకృతి అందాలను తిలకిస్తూ గడపడానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని పర్యాటకులు చెబుతుంటారు. 

సీఫుడ్ కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. రొయ్యలు, పీతలు, చేపలతో ఇక్కడ నోరూరించే వంటకాలు తయారుచేస్తారు. రాక్ రెస్టారెంట్ లో అక్టోపస్ తో వండే వంటకం చాలా స్పెషల్. 

ఈ రెస్టారెంట్లో పిల్లల కోసం ప్రత్యేక వినోదాన్ని అందించే కార్యక్రమాలు కూడా ఉంటాయట. పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు లక్కీ డ్రాలు కూడా నిర్వహిస్తుంటారు.


More Telugu News