టీమిండియా దూకుడుగా ఆడలేదన్న కివీస్ మాజీ క్రికెటర్... కౌంటరిచ్చిన శ్రీశాంత్

  • వరల్డ్ కప్ ముంగిట కివీస్, భారత్ మాజీల మధ్య మాటల యుద్ధం
  • ప్రధాన టోర్నీల్లో టీమిండియా ఆటతీరు సాధారణంగా ఉంటుందన్న డౌల్
  • మీరు భారత్ వస్తున్నారు కదా... టీమిండియా దూకుడు అప్పుడు తెలుస్తుందన్న శ్రీశాంత్
  • ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచారా అంటూ ఎత్తిపొడుపు
క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కామెంటేటర్ గా మారిన న్యూజిలాండ్ పేస్ దిగ్గజం సైమన్ డౌల్ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ కాస్త ఘాటుగానే స్పందించాడు. ప్రధాన టోర్నీల్లో టీమిండియా దూకుడుగా ఆడలేదని డౌల్ అన్నాడు. అందుకు శ్రీశాంత్ బదులిస్తూ... వరల్డ్ కప్ కోసం మీ (న్యూజిలాండ్) జట్టు భారత్ వస్తుందిగా... టీమిండియా దూకుడుగా ఆడగలదా, లేదా అనేది అప్పుడు తెలుస్తుంది అని వ్యాఖ్యానించాడు. 

"మీ మాటలు విరాట్ కోహ్లీ గనుక వింటే మీ పని అవుట్. ఇతర జట్ల గురించి మాట్లాడడం కాదు... ముందు మీ జట్టు పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్ చేరిందంటే అది అదృష్టం వల్లే. సెమీఫైనల్లో ధోనీ రనౌట్ కాకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇంతజేసీ న్యూజిలాండ్ ఆ టోర్నీలో కప్ గెలిచిందా అంటే అదీ లేదు. ఆతిథ్య ఇంగ్లండ్ కు వరల్డ్ కప్ అప్పగించి వచ్చారు" అంటూ శ్రీశాంత్ ఎద్దేవా చేశాడు.

ఇప్పటివరకు మీరు (కివీస్) ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచారా? అని ఎత్తిపొడిచాడు. మీరు అవతలివాళ్లపై పంచ్ వేశాం అనుకున్నప్పుడు, అవతలివైపు నుంచి వచ్చే పంచ్ ను కూడా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని డౌల్ కు హితవు పలికాడు.


More Telugu News