విడుదలకు ముందు లీక్ అయిన వన్ ప్లస్ ప్యాడ్ గో ఫీచర్లు

  • అక్టోబర్ 6న విడుదల కానున్న వన్ ప్లస్ ప్యాడ్ గో
  • భారత్ లోనే ముందుగా విడుదల
  • క్వాడ్ స్పీకర్ తో డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్
  • 11,35 అంగుళాల డిస్ ప్లే తో రానున్న టాబ్లెట్
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్ ప్లస్ భారత మార్కెట్లో వన్ ప్లస్ ప్యాడ్ గో పేరిట రెండో ఆండ్రాయిడ్ టాబ్లెట్ ను విడుదల చేయనుంది. అక్టోబర్ 6న ఇది విడుదల కాబోతుండగా, దీనికి సంబంధించిన ఫీచర్లు బయటకు వచ్చాయి. ఈ టాబ్లెట్ డిజైన్ గురించి వన్ ప్లస్ లోగడ టీజర్ విడుదల చేసింది. అమెజాన్ మైక్రో సైట్లో కొన్ని ఫీచర్లతో తాజా టీజర్ కనిపిస్తోంది. 

వన్ ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ 11.35 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. 2.4కే రిజల్యూషన్, 7.5 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇందులో క్వాడ్ స్పీకర్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ సైతం ఏర్పాటు చేశారు. దీంతో థియేటర్ అనుభవం కలగనుంది. దీన్ని ముందుగా భారత మార్కెట్లోనే విడుదల చేయనున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వన్ ప్లస్ ప్యాడ్ టాబ్లెట్ కంటే తక్కువ ధర ఉంటుందని అంచనా. వెనుక భాగంలో మ్యాటే, గ్లాసీ డిజైన్ ఉంటుంది. ట్విన్ మింట్ కలర్ ఆప్షన్ తో వస్తుంది. ఈ టాబ్లెట్ కు సంబంధించి మరిన్ని వివరాలు విడుదల కావాల్సి ఉంది.

అమెజాన్ తో పాటు ఫ్లిప్ కార్ట్, వన్ ప్లస్ సైట్లలోనూ దీన్ని విక్రయించనున్నారు. నిపుణులు అంచనా వేస్తున్న ఫీచర్లను పరిశీలించినట్టయితే ఈ వన్ ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ గా, యూఎఫ్ఎస్ 2.2 టెక్నాలజీతో రానుంది. 12 జీబీ వేరియంట్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, వెనుక, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా, 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయని అంచనా వేస్తున్నారు.


More Telugu News