సీఐడీ చీఫ్ సంజయ్‌పై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • సర్వీస్ రూల్స్ అతిక్రమించి వైసీపీకి తొత్తులా పని చేస్తున్నారని ఆరోపణ
  • జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని విమర్శ 
  • అమిత్ షాకు ఆధారాలు అందించిన రామ్మోహన్ నాయుడు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులా పని చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీకి వత్తాసు పలుకుతున్న సీఐడీ చీఫ్ సంజయ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ రాజకీయ పక్షపాతాలు లేకుండా పని చేయాలని, కానీ ఆయన అలా ఉండటం లేదన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే, విచారణ చేయకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.

సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. దర్యాఫ్తు చేసి, నివేదికను కోర్టుకు సమర్పించాల్సిన బాధ్యత కలిగిన అధికారి ఫక్తు వైసీపీ నేతగా ఢిల్లీ, హైదరాబాద్, అమరావతిలలో మీడియా ముందుకు వస్తున్నారన్నారు. గోప్యంగా ఉంచాల్సిన దర్యాఫ్తు వివరాలను మీడియాకు విడుదల చేస్తున్నారన్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ ఉల్లంఘించిన సర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధనలకు సంబంధించిన ఆధారాలను అమిత్ షాకు అందజేశారు.


More Telugu News