ఆ విషయంలో కాంగ్రెస్ నెంబర్ 1.. బీజేపీ నెంబర్ 2: హరీశ్ రావు

  • తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయన్న హరీశ్ రావు
  • కేసీఆర్ ను గద్దె దించాలనే కుట్రలు జరుగుతున్నాయని విమర్శ
  • అంగన్ వాడీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మండిపాటు
తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆ పార్టీల బోగస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు ఆగం కావొద్దని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపడంలో కాంగ్రెస్ ఏ1, బీజేపీ ఏ2 అని అన్నారు. మనం వెనుకబడటానికి కారణం కూడా ఈ రెండు పార్టీలేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలనే కుట్రలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కరెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాని చెప్పారు. తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు. 

రాజకీయ లబ్ధి కోసం అంగన్ వాడీ కార్యకర్తలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని హరీశ్ మండిపడ్డారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ వేతనాలను చెల్లిస్తోందని చెప్పారు. త్వరలోనే పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి... ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాలను పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న ప్రధాని మోదీ ఇక్కడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.


More Telugu News