న్యూస్ పేపర్లలో చుట్టిన ఆహారం తింటున్నారా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే!

  • వార్తా పత్రికల్లో ఆహార పదార్థాలను ప్యాకింగ్‌ చేయడం, భద్రపరచడం ఆరోగ్యానికి మంచిది కాదన్న ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 
  • దీన్ని వెంటనే ఆపాలని వినియోగదారులు, ఆహార విక్రేతలకు సూచన
  • న్యూస్ పేపర్లలోని ఇంక్ తో ఆరోగ్యానికి ముప్పు అని హెచ్చరిక
స్ట్రీట్ ఫుడ్ సెంటర్లతో పాటు చాలా హోటళ్లలో టిఫిన్లు, తినుబండారాలను న్యూస్ పేపర్లలో చుట్టిస్తుంటారు. అలా ప్యాకింగ్ చేసి, చుట్టిచ్చిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇలా వార్తా పత్రికల్లో ఆహార పదార్థాలను ప్యాకింగ్‌ చేయడం, భద్రపరచడం ఆరోగ్యానికి మంచిది కాదని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది. పేపర్లలో వాడే ప్రింటింగ్‌ ఇంక్‌లో హానికరమైన రసాయనాలు ఉంటాయని, వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. దేశవ్యాప్తంగా వినియోగదారులు, ఆహార విక్రేతలు ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడానికి, వడ్డించడానికి, నిల్వ చేయడానికి వార్తాపత్రికలను ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఆహారాన్ని చుట్టడానికి,ప్యాక్ చేయడానికి వార్తా పత్రికలను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసింది.

‘వార్తా పత్రికలలో ఉపయోగించే సిరా ప్రతికూల ఆరోగ్య ప్రభావాలతో వివిధ బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని కలుషితం చేస్తుంది. వాటిలో చుట్టిన ఆహారం తింటే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రింటింగ్ ఇంక్‌లలో సీసం, హెవీ మెటల్స్‌ తో సహా రసాయనాలు ఉంటాయి. ఇవి ఆహారంలోకి ప్రవేశించగలవు. కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. అలాగే, వార్తా పత్రికలను ఇంటింటికి చేర్చే సమయంలో వివిధ పర్యావరణ పరిస్థితులకు లోనవుతాయి. వాటిపై బ్యాక్టీరియా, వైరస్‌లు చేరి ఇతర వ్యాధికారక క్రిములు కూడా చేరుతాయి’ అని పేర్కొంది. ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనల ప్రకారం ఆహారాన్ని నిల్వ చేయడానికి, చుట్టడానికి వార్తాపత్రికలు, అలాంటి వాటిని పోలిన పేపర్లను ఉపయోగించడం నిషేధమని వెల్లడించింది.


More Telugu News