మ్యాక్స్ వెల్ మ్యాజిక్... చివరి వన్డేలో టీమిండియా ఓటమి

  • రాజ్ కోట్ లో మూడో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 పరుగులు
  • 49.4 ఓవర్లలో 286 పరుగులకు భారత్ ఆలౌట్ 
  • 4 కీలక వికెట్లు తీసిన మ్యాక్స్ వెల్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ స్పిన్ మ్యాజిక్ కు టీమిండియా తలవంచింది. 353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. అన్ని రంగాల్లో రాణించిన ఆసీస్ 66 పరుగుల తేడాతో గెలిచి ఊరట పొందింది. మ్యాక్స్ వెల్ 10 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. 

ఓ దశలో భారత్ గెలుపుబాటలో పయనిస్తున్నట్టు అనిపించినా, మ్యాక్స్ వెల్ తన ఆఫ్ స్పిన్ తో టీమిండియా టాపార్డర్ జోరుకు కళ్లెం వేశాడు. వాషింగ్టన్ సుందర్ (18), రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లీ (56), శ్రేయాస్ అయ్యర్ (48)ల వికెట్లు మ్యాక్స్ వెల్ ఖాతాలోకి చేరాయి. 

ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ఓపెనర్ గా బరిలో దిగాడు. పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన సుందర్ 30 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ శర్మ 57 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 6 సిక్సర్లతో రాణించగా, కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ మరో అర్ధసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా సమయోచితంగా బ్యాటింగ్ చేసినా... మ్యాక్స్ వెల్ ధాటికి వెనుదిరగకతప్పలేదు. చివర్లో జడేజా 35 పరుగులు చేసినా, జట్టును గెలుపు దరిదాపుల్లోకి తీసుకెళ్లలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ (8) విఫలమయ్యాడు. 

ఆసీస్ బౌలర్లలో జోష్ హేజెల్ వుడ్ 2, స్టార్క్ 1, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, కామెరాన్ గ్రీన్ 1, తన్వీర్ సంఘా 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ను 1-2తో ముగించింది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా సిరీస్ విజేతగా నిలిచింది. 

ఇక, భారత జట్టు వరల్డ్ కప్ కోసం సన్నద్ధం కానుంది. వరల్డ్ కప్ లో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతోనే ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబరు 8న చెన్నైలో జరగనుంది.


More Telugu News