మేనకాగాంధీ సంచలన ఆరోపణలపై స్పందించిన ఇస్కాన్

  • ఇస్కాన్ గోశాలల్లో పాలివ్వని ఆవులను కబేళాలకు విక్రయిస్తున్నారన్న మేనకా
  • ఇస్కాన్ గోశాలల్లో పాలివ్వని ఆవులను పోషించడం లేదని వ్యాఖ్యలు
  • ఈ విషయాన్ని తాను అనంతపూర్ గోశాలలో గుర్తించానని వెల్లడి 
  • మేనకా ఆరోపణలను ఖండించిన ఇస్కాన్
  • మేనకా అనంతపూర్ గోశాల పర్యటన వట్టిదేనని వివరణ
బీజేపీ ఎంపీ, జంతు హక్కుల ఉద్యమకారిణి మేనకాగాంధీ ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్ నెస్) నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

ఇస్కాన్ కు చెందిన గోశాలల్లో పాలివ్వని ఆవులను కబేళాలకు విక్రయిస్తున్నారని మేనకాగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అనంతపూర్ గోశాలను సందర్శించిన సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించానని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి భారీగా ప్రయోజనాలు పొందుతున్న ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ అని ఆమె మండిపడ్డారు. ఇన్ని గోవులను కబేళాలకు తరలించిన ఇస్కాన్... ఇతరులకు ఆదర్శంగా ఎలా నిలుస్తుందని ప్రశ్నించారు.

అయితే, మేనకాగాంధీ ఆరోపణలను ఇస్కాన్ వర్గాలు ఖండించాయి. మేనకగాంధీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె తప్పుడు ఆరోపణలు చేశారని ఇస్కాన్ జాతీయ అధికార ప్రతినిధి యుధిష్టర్ గోవింద దాస్ స్పష్టం చేశారు. అనంతపూర్ గోశాలను సందర్శించినట్టు మేనకాగాంధీ చెబుతున్నారని, కానీ, ఆమె అక్కడికి వచ్చినట్టు గోశాల సిబ్బంది ఎవరూ ధ్రువీకరించలేదని గోవింద దాస్ వివరించారు. 

తమ గోశాలల్లో ఆవులు, ఎద్దులను వాటి జీవితాంతం పోషిస్తున్నట్టు స్పష్టం చేశారు. భారత్ లోనే కాదు, ఇతర దేశాల్లో తాము గో సంరక్షణ చేపడుతున్నట్టు తెలిపారు. అంతేకాదు, పాలు ఇవ్వని ఆవులు, ఎద్దుల పోషణకు సంబంధించిన దృశ్యాలతో కూడిన వీడియోను కూడా ఇస్కాన్ పంచుకుంది.


More Telugu News