టీమిండియాతో చివరి వన్డే... భారీ స్కోరు దిశగా ఆసీస్

  • టీమిండియా, ఆసీస్ మధ్య 3 వన్డేల సిరీస్
  • ఇప్పటికే 2-0తో సిరీస్ టీమిండియా కైవసం
  • నేడు రాజ్ కోట్ లో ఆఖరి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు చివరి వన్డే రాజ్ కోట్ లో జరుగుతోంది. ఇప్పటికే టీమిండియా ఈ సిరీస్ ను 2-0తో చేజిక్కించుకోగా, ఆసీస్ నేటి మ్యాచ్ లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. 

ఈ క్రమంలో, టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ టీమిండియా బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొని బౌండరీల వర్షం కురిపించారు. మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. కుల్దీప్ బౌలింగ్ లో మార్ష్ అవుటయ్యాడు. వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు. 

వన్ డౌన్ లో వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా దూకుడుగా ఆడడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్మిత్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 74 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 40 ఓవర్లలో 5 వికెట్లకు 286 పరుగులు కాగా... క్రీజులో లబుషేన్, గ్రీన్ ఉన్నారు. 

టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ సాధించారు. కాగా, తొలి రెండు మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు.


More Telugu News