ఈసారి భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ కు వెళుతున్న సినిమా ఇదే!

  • మలయాళ సినిమా '2018'కి దక్కిన ఆస్కార్ ఎంట్రీ
  • భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ లో పోటీపడనున్న చిత్రం
  • 2018లో కేరళను అతలాకుతలం చేసిన వరదలు
  • ఇదే కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకాదరణ పొందిన సినిమా
ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా హాలీవుడ్ లోనూ భారతీయ చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం మొదలైంది. ఇప్పుడు మరోసారి ఆస్కార్ సందడికి తెరలేచింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు అధికారిక ఎంట్రీల ఘట్టం నడుస్తోంది. కాగా ఆస్కార్-2024 ఏడాదికి భారత్ నుంచి మలయాళ చిత్రం '2018' అధికారికంగా ఎంపికైంది.

2018లో కేరళలో వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టంతో కేరళ కుదేలైంది. ఈ వరదల కథాంశంతో దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ 2018 చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ మలయాళ నటుడు టొవినో థామస్ ప్రధానపాత్రధారిగా రూపొందిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. 

కాగా, వచ్చే ఏడాది ఆస్కార్ కు భారత్ నుంచి 2018 చిత్రం అధికారిక ఎంట్రీగా వెళుతోందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సెలెక్షన్ కమిటీ చైర్మన్ గిరీశ్ కాసరవల్లి నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ 2018 చిత్రానికి ఓటేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ, రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ, మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే వంటి చిత్రాలతో పాటు తెలుగు సినిమా బలగం, మరాఠీ చిత్రాలు వాల్వీ, బాప్లీవోక్, తమిళ చిత్రం 'ఆగస్టు 16, 1947'ను  కూడా సెలెక్షన్ కమిటీ పరిశీలించింది. 

అయితే, వాతావరణ మార్పులు, పర్యావరణం, వరదలు ఇతివృత్తంగా తెరకెక్కిన 2018 చిత్రాన్ని ఆస్కార్ కు పంపాలని కమిటీ తీర్మానించింది. ఈ మలయాళ సినిమా ఆస్కార్ లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం కేటగిరీలో పోటీపడనుంది.


More Telugu News