నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు: మాజీ మంత్రి పేర్ని నాని

  • లోకేశ్ హెరిటేజ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే అమరావతిలో భూమి కొనుగోలు నిర్ణయమని వెల్లడి
  • లింగమనేని రమేశ్ పొలం మధ్య నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్ చేశారని ఆరోపణ
  • హెరిటేజ్, నారాయణ కాలేజీల కోసం రోడ్డు ప్లాన్ మార్చారని విమర్శ
నారా లోకేశ్ హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాజధాని అంశంపై రోజుకో డ్రామా నడిపారన్నారు. టీడీపీ హయాంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి అన్నారు. దోపిడీ దొంగలు రెక్కీ వేసినట్లుగా రింగ్ రోడ్డు కుంభకోణం జరిగిందని, కానీ ఇది కేబినెట్ నిర్ణయమంటూ చంద్రబాబు చెప్పారన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పేరుతో స్కాం చేశారన్నారు.

లింగమనేని రమేశ్ పొలం మధ్య నుంచి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్ మార్చారని ఆరోపించారు. అలాగే హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్ మార్చినట్లు చెప్పారు. ఏ14గా ఉన్న లోకేశ్ ఐఆర్ఆర్‌తో తనకేం సంబంధమని చెబుతున్నారని, కానీ ఆ సమయంలో ఆయన హెరిటేజ్ డైరెక్టర్‌గా ఉన్నారన్నారు. ఆ సమయంలోనే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారన్నారు. తాను దేశభక్తితోనే తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చానని లింగమనేని హైకోర్టులో చెప్పారని, కానీ చంద్రబాబు సీఎం పదవి పోగానే లింగమనేనికి రూ.27 లక్షలు అద్దెగా ఇచ్చారన్నారు. ఈ ట్రాన్సాక్షన్ పైన మాట్లాడాలన్నారు.

రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కు ఒప్పుకోని వారిపై ఈ కేసులోని ఏ2, ఏ14 ఒత్తిడి తెచ్చారన్నారు. ప్రభుత్వం భూమిని లాక్కుంటుందని భయపెట్టారని, ఆ తర్వాత ఎకరం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే రాయించుకున్నారన్నారు. అలాంటి వారికి శిక్ష పడాలన్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారని, కానీ రూ.371 టిప్పు అనుకుంటే అమరావతిలో పది ఎకరాలు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని నిలదీశారు. అసైన్డ్ భూములు లాక్కున్నారని, సమస్యలు వస్తాయని అధికారులు చెప్పినా జీవో41 తీసుకు వచ్చారన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న వారికి నామినేటెడ్ పదవి ఇస్తామన్న లోకేశ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. యువతను రెచ్చగొట్టి ఢిల్లీలో తిరుగుతున్నారన్నారు.


More Telugu News