రోడ్డు వేయకముందే ఎలైన్ మెంట్ పేరుతో దోచుకున్నారు: మంత్రి రోజా

  • లోకేశ్ మాటలకు జనం నవ్వుతున్నారని వ్యంగ్యం
  • స్కాంలలో ఇరుక్కుని ఢిల్లీకి పారిపోయారంటూ విమర్శ
  • నారా భువనేశ్వరి, బ్రాహ్మణి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపణ
  • ఎన్టీఆర్ కూతురు, మనవరాలనే గౌరవం పోతోందని మండిపడ్డ రోజా
స్కాంలలో ఇరుక్కుని ఢిల్లీకి పారిపోయిన నారా లోకేశ్.. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు చూసి జనం నవ్వుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. అరెస్టు భయంతో వణికిపోతూ ఆరు నెలల్లో జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. బుధవారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ రాష్ట్రపతిని కలవని లోకేశ్ ఇప్పుడు తండ్రిని విడుదల చేయాలంటూ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తిరుగుతున్నా వారు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని చెప్పారు. అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు స్కాం ఎలా జరిగిందంటూ నారా లోకేశ్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రోడ్డు వేయకముందే ఎలైన్ మెంట్ పేరుతో దోచుకున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచుకున్నా చర్యలు తీసుకోకూడదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. 

అరెస్టు భయంతో ఢిల్లీలో దాక్కున్న లోకేశ్.. ఎర్రబుక్ లో రాసుకుంటానంటూ అధికారులను బెదిరిస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. ఎర్రబుక్ లో రాయడం సంగతెలా ఉన్నా.. ముందు తన పేరు సీఐడీ మెమోలోకి ఎక్కిందనే విషయం తెలుసుకోవాలంటూ లోకేశ్ కు చురకలు వేశారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలు అబద్ధాలు చెబుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. వారి మాటలు వింటుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతోందని చెప్పారు.

హెరిటేజ్ ఆస్తులపై నారా భువనేశ్వరి మాటలను ప్రస్తావిస్తూ.. హెరిటేజ్ లో 2 శాతం వాటా అమ్మితేనే రూ.400 కోట్లు వస్తాయంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లు ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు ఈ ఆస్తుల విషయాన్ని పేర్కొన్నారా? అంటూ నిలదీశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి విలువ రూ.600 కోట్లని రోజా తెలిపారు. చంద్రబాబు కుటుంబం మొత్తం టీమ్ వర్క్ గా అవినీతికి పాల్పడ్డారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఈ స్కాంల గురించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.


More Telugu News