వేతనం లేకుండా పనిచేయనున్న అంబానీ పిల్లలు..!

  • బోర్డు డైరెక్టర్లుగా నియామకం కోసం తీర్మానం చేసిన రిలయన్స్
  • వాటాదార్ల అనుమతి కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపినట్లు వెల్లడి
  • జీతం తీసుకోకుండానే పనిచేస్తున్న ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యాపారంలోకి వారసులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ లో ప్రస్తుతం వివిధ బాధ్యతలు చూస్తున్న ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీలను కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకునేందుకు తాజాగా కంపెనీ తీర్మానం చేసింది. వాటాదారుల అనుమతి కోసం ఈ తీర్మానాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించింది. అయితే, డైరెక్టర్లుగా ఈ ముగ్గురూ ఎలాంటి వేతనం లేకుండానే పనిచేయనున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనందుకు కొంత ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాల్లో కొంత వాటాను వారికి చెల్లించేలా బోర్డు తీర్మానం చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ముకేశ్ అంబానీ రిలయన్స్ కంపెనీ నుంచి జీతం తీసుకోకుండానే పనిచేస్తున్నారు. కంపెనీ లాభాల్లో వాటా మాత్రమే ఆయన అందుకుంటున్నారు. తండ్రి బాటలోనే ఆకాశ్, ఈశా, అనంత్ లు కూడా నడుస్తారని, కంపెనీ నుంచి ఎలాంటి జీతం తీసుకోబోరని కంపెనీ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ కంపెనీలో ముకేశ్ అంబానీ సమీప బంధువులు నికిల్, హితల్ లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. వారు మాత్రం జీతంతో పాటు ఇతర సదుపాయాలు, కమీషన్లు తీసుకుంటున్నారు.


More Telugu News