నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్

  • రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన బండి రమేశ్
  • ప్రజల కోసం చంద్రబాబు జీవితాన్ని ధారబోశారని వ్యాఖ్య
  • చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న బీఆర్ఎస్ నేత
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని కలిశారు. వారికి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సంఘీభావాన్ని ప్రకటించేందుకే రాజమండ్రికి వచ్చానని తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం చంద్రబాబు తన జీవితాన్ని ధారబోశారని అన్నారు. కార్యదక్షత కలిగిన గొప్ప నేత చంద్రబాబు అని కితాబునిచ్చారు. అక్రమ కేసుల నుంచి బయటపడి, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. 

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందిస్తే... అది వారి వ్యక్తిగత విషయమని మంత్రి కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడేందుకే ఐటీ ఉద్యోగుల ర్యాలీకి అనుమతిని ఇవ్వలేదని చెప్పారు. ర్యాలీలకు ఎందుకు అనుమతిని ఇవ్వలేదని టీడీపీ నేత నారా లోకేశ్ తనను అడిగారని తెలిపారు.


More Telugu News