విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక సంకేతాలు పంపింది: జీవీఎల్

  • స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలిచిపోయినట్టేనన్న జీవీఎల్
  • సంస్థలను లాభాల బాటలో నడిపిస్తేనే ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుందని వెల్లడి
  • విశాఖ ఉక్కు ప్రజల ఆస్తి... అందరూ కాపాడుకోవాలని పిలుపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడడంతో భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికరమైన కబురు వినిపించారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచన చేస్తోందని, యథాతథ స్థితిని కొనసాగించేలా కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయని వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం దాదాపు నిలిచిపోయినట్టేనని, అయితే, సంస్థను లాభాల బాటలో నడిపించాల్సి ఉందని, అప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని అన్నారు. 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రజల ఆస్తి అని, పరిశ్రమను కాపాడుకోవడం అందరి బాధ్యత అని జీవీఎల్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారాలకు పాల్పడరాదని హితవు పలికారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు, ఐరన్ ఓర్ గనులు కేటాయించకపోవడానికి మోదీ సర్కారుదే బాధ్యత అనడం తగదని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గత యాజమాన్యం వల్లే సంస్థకు ఇబ్బందులు వచ్చాయని వివరించారు.


More Telugu News