చంద్రబాబుపై ఒవైసీకి ఎంత కక్ష ఉందో అర్థమయింది: టీడీపీ నేత షరీఫ్

  • చంద్రబాబు జైల్లో హాయిగా ఉన్నారన్న ఒవైసీ
  • జైలు అంటే విహార కేంద్రమా అని మండిపడ్డ షరీఫ్
  • ముస్లింలను ఇబ్బంది పెడుతున్న జగన్ ను సపోర్ట్ చేయాలని ఎలా చెపుతారని ప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మొద్దని, సీఎం జగన్ పాలన బాగుందని ఎంఐఎం అధినేత చేసిన వ్యాఖ్యలపై ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్, టీడీపీ నేత షరీఫ్ మండిపడ్డారు. చంద్రబాబు మీద ఎంత కక్ష ఉందో, ఎంత దురుద్దేశం ఉందో ఒవైసీ వ్యాఖ్యలతో అర్థమవుతోందని చెప్పారు. జైల్లో చంద్రబాబు హాయిగా ఉన్నారని ఒవైసీ చెప్పారని... జైలు అంటే విహార కేంద్రమా? లేక లాడ్జా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని చెబుతూ, వైసీపీ మినహా అన్ని పార్టీలు స్పందించాయని చెప్పారు. 

ఏపీలో ముస్లింలను జగన్ అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని... ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన జగన్ ను సపోర్ట్ చేయాలని ఒవైసీ ఎలా చెపుతారని షరీఫ్ దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో వంద మందికి పైగా మైనార్టీలపై దాడులు జరిగాయని తెలిపారు. కేవలం చంద్రబాబుపై ద్వేషంతోనే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దమ్ముంటే ఏపీకి వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు.


More Telugu News