ఆధార్ విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేసిన మూడీస్ కంపెనీ

  • వేడి వాతావరణం వల్ల వేలిముద్రలపై ఆధారపడలేమని వివరణ
  • నిరాధార ఆరోపణలంటూ తోసిపుచ్చిన భారత ప్రభుత్వం
  • ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన డిజిటల్ ఐడీ అని కితాబు 
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఐడీ ప్రోగ్రామ్ గా గుర్తింపు పొందిన ఆధార్ వ్యవస్థపై గ్లోబల్ రేటింగ్ సంస్థ మూడీస్ సందేహాలను వ్యక్తం చేసింది. భారత దేశం లాంటి వేడి వాతావరణం ఉన్న దేశాల్లో వేలిముద్రలపై ఆధారపడితే విశ్వసనీయత ఉండదని పేర్కొంది. వేడి, చెమట వల్ల వేలిముద్రలను సరిగ్గా గుర్తించడం సాధ్యం కాదని, అందువల్ల ఆధార్ వ్యవస్థకు పూర్తిస్థాయి విశ్వసనీయత ఉండదని తెలిపింది. మూడీస్ సంస్థ ఆరోపణలపై భారత్ స్పందిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఐడీ వ్యవస్థపై పేరొందిన సంస్థ ఇలా నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొంది. ఆధార్.. ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన డిజిటల్ ఐడీ అని స్పష్టం చేసింది. తన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలంటూ మూడీస్ కంపెనీకి ప్రశ్నలు సంధించింది.

మూడీస్ ఏమన్నదంటే..
భారత దేశంలో వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సేవలకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారని మూడీస్ కంపెనీ పేర్కొంది. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ ద్వారా వ్యక్తిగత గుర్తింపును నిర్ధారిస్తున్నారని వివరించింది. అయితే, భారత్ లో వేడి వాతావరణం, చెమట కారణంగా వేలిముద్రలపై ఆధారపడడం సరికాదని, దీనివల్ల కచ్చితత్వం ఉండదని అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయంగా వన్ టైమ్ పాస్ వర్డ్ వంటి పద్ధతులను అమలు చేస్తే మరింత కచ్చితత్వం వస్తుందని సూచించింది.

ప్రభుత్వ వివరణ..
మూడీస్ సంస్థ తన ఆరోపణలకు కనీస ఆధారాలు చూపలేదని, నిరాధార ఆరోపణలు చేసిందని భారత ప్రభుత్వం విమర్శించింది. ఆధార్ వ్యవస్థలో వ్యక్తిగత గోప్యత, భద్రతపైన మూడీస్ చేసిన ఆరోపణలు అర్థరహితమని తేల్చిచెప్పింది. ఆధార్ డేటా బేస్ లో ఇప్పటి వరకు ఎలాంటి సెక్యూరిటీ లోపాలు కానీ, డాటా బ్రీచ్ కానీ తలెత్తలేదని పార్లమెంట్ లో వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ప్రాజెక్టు అంటూ ఆధార్ వ్యవస్థకు ఇందులో కితాబునిచ్చింది.


More Telugu News