సర్కారియా కమిషన్ ప్రకారం తమిళిసై గవర్నర్‌గా ఉండకూడదు: హరీశ్ రావు

  • పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించవచ్చా? అని నిలదీత
  • తెలంగాణ పట్ల గవర్నర్ తీరు మారలేదని హరీశ్ రావు ఆగ్రహం
  • కేబినెట్ సిఫార్సు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం సరికాదని విమర్శ  
తెలంగాణ పట్ల గవర్నర్ తీరు మారలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేబినెట్ సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం సరికాదన్నారు. వారు బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నారనే కారణంతో తిరస్కరించడం, అనర్హులు కారని చెప్పడం ఏమిటన్నారు. పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించవచ్చా? అని ప్రశ్నించారు.

ఆ లెక్కన చూస్తే సర్కారియా కమిషన్ ప్రకారం తమిళిసై గవర్నర్ పదవిలో ఉండకూడదన్నారు. కానీ ఆమె ఎలా తెలంగాణ గవర్నర్‌గా వచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ నేత గులాం అలీని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపించలేదా? అని నిలదీశారు. మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్ సింగ్, రాకేశ్ సిన్హాలు బీజేపీలో సభ్యులు కారా? అన్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేశారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో మరొక న్యాయమా? అన్నారు. గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు.


More Telugu News