ముస్లిం విద్యార్థికి చెంపదెబ్బ ఘటనపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

  • బోధించే విధానం ఇదేనా? అంటూ ప్రశ్నించిన కోర్టు
  • పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరాలు
  • రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉందంటూ వ్యాఖ్య
  • ప్రత్యేక ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు ఆదేశాలు
ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో (వేరే మతానికి చెందిన) చెంప దెబ్బ కొట్టించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ వ్యవహరించాలని పేర్కొంది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం దీనిపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గత నెలలో విద్యార్థిని చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తమకు తీవ్ర అభ్యంతరాలున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

‘‘టీచర్ ఒక కమ్యూనిటీని లక్ష్యం చేసుకున్నారు. విద్యార్థులకు టీచర్ బోధించే విధానం ఇదేనా?  నాణ్యమైన విద్య అంటే ఇదేనా? ఈ ఘటనకు రాష్ట్రం తప్పకుండా బాధ్యత వహించాలి. పాఠశాల సదరు విద్యార్థికి కౌన్సిలర్ ను నియమించిందా? ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించాలి. ఇది తీవ్రమైన అంశం ’’ అని బెంచ్ పేర్కొంది. విద్యా హక్కు చట్టంలోని నిబంధనను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని.. విద్యార్థులపై శారీరక, మానసిక వేధింపులను, కులం, మతం ప్రాతిపదికన వివక్షను విద్యా హక్కు చట్టం నిషేధిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.  ఏదో ఒక మతానికే చెందిన విద్యార్థిని శిక్షించడం అన్నది నాణ్యమైన విద్యా కాబోదని పేర్కొంది. నిపుణుడైన కౌన్సిలర్ ను నియమించి సదరు విద్యార్థికి కౌన్సిలింగ్ ఇప్పించాలని, దాంతో ట్రామా నుంచి అతడు కోలుకోగలడని యూపీ సర్కారును కోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తును సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగించి, మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News