ఇండోర్ మ్యాచ్ లో టీమిండియా అరుదైన రికార్డులు
- వన్డేల్లో 3 వేల సిక్స్ లు బాదిన తొలి జట్టుగా భారత్
- ఒక వేదికపై ఓటమి ఎరుగని నాలుగో జట్టుగా రికార్డు
- ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్
ఇండోర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో టీమిండియా పలు అరుదైన రికార్డులను సృష్టించింది. వన్డే సిరీస్ ను 2-0 తో సొంతం చేసుకుంది. వన్డేల్లో అత్యధిక సిక్స్ లు బాదిన తొలి జట్టుగా అవతరించింది. అంతేకాదు ఇండోర్ స్టేడియంలో వరుసగా ఏడు మ్యాచ్ లను గెలిచి ఒక వేదికపై ఓటమి ఎరుగని నాలుగో జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ ఘనత సాధించాడు. ఆసిస్ పై అత్యధిక స్కోర్ చేసి, గెలుపొందిన నాలుగో జట్టు టీమిండియాదే కావడం మరో విశేషం. ఈ మ్యాచ్ లో నెలకొల్పిన రికార్డులు..
- ఇండోర్ లో ఆడిన ఏడు మ్యాచ్ లలో టీమిండియాదే విజయం. ఇలా ఒక వేదికపై ఓటమి లేకుండా నెలకొల్పిన రికార్డులలో ఇది నాలుగవది. డునెదిన్ స్టేడియంలో న్యూజిలాండ్ 9 విజయాలు సాధించగా.. బులవాయో వేదికపై పాకిస్థాన్ 8 మ్యాచ్ లు గెల్చుకుంది. పాక్ లోని హైదరాబాద్ స్టేడియంలో 7 మ్యాచ్ లు గెలిచింది.
- ఆస్ట్రేలియాపై అశ్విన్ 144 వికెట్లు తీశాడు. గతంలో అనిల్ కుంబ్లే ఇదే జట్టుపై 142 వికెట్లు, పాకిస్థాన్ పై కపిల్ దేవ్ 141 వికెట్లు తీశారు.
- తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సాధించిన అత్యధిక స్కోర్లలో ఇది రెండవది. 2012 లో వెస్టిండీస్ పై భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది.
- మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ గెల్చుకోవడం ఇది ఏడోసారి. స్వదేశంలో ఆరుసార్లు, ఆస్ట్రేలియాలో ఒక సిరీస్ ను ఇలా గెల్చుకుంది.
- ఆస్ట్రేలియాపై ప్రత్యర్థి జట్టు సాధించిన అత్యధిక స్కోర్లలో ఇది నాలుగవది. గతంలో ఇంగ్లాండ్ 481 (2018), సౌతాఫ్రికా రెండు మ్యాచ్ లలో 438, 416 పరుగులు చేసింది.