ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్‌ను మించిన సమర్థుడు లేడు: జేడీయూ నేత

  • ప్రధానిగా కావాల్సిన అన్ని లక్షణాలు నితీష్ కుమార్‌లో ఉన్నాయని వ్యాఖ్య
  • I.N.D.I.A. కూటమి ఎప్పుడు ప్రధాని పేరును ప్రకటించినా అది నితీష్ కుమారేనన్న పార్టీ నేత
  • లోహియా తర్వాత మహోన్నత సోషలిస్ట్ నేత నితీష్ కుమార్ అని ప్రధానే కితాబిచ్చారని గుర్తు చేసిన మహేశ్వర్ హజారీ
ప్రధానిగా తమ పార్టీ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని డిప్యూటీ స్పీకర్, జేడీయూ నేత మహేశ్వర్ హజారీ అన్నారు. నితీష్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా I.N.D.I.A. కూటమి త్వరలో ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా కావాల్సిన అన్ని లక్షణాలు నితీశ్ కుమార్‌లో ఉన్నాయన్నారు. I.N.D.I.A. కూటమి ప్రధాని పేరును ఎప్పుడు ప్రకటించినా అది నితీష్ కుమార్ పేరే అన్నారు.

దేశంలో రామ్‌మనోహర్‌ లోహియా తర్వాత మహోన్నతమైన సోషలిస్ట్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నితీష్‌ కుమార్‌ అని ప్రధాని నరేంద్రమోదీ గతంలోనే కితాబిచ్చారని గుర్తు చేశారు. నితీష్ కుమార్ ఐదుసార్లు కేంద్రమంత్రిగా పని చేశారని, 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ సన్నద్ధతపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

మరోవైపు, నితీష్ కుమార్ మాత్రం తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను నాయకత్వం వహిస్తానని పలుమార్లు చెప్పారు. నేను ఇప్పటికే చెప్పానని, మళ్లీ చెబుతున్నానని, తాను ఏ పదవి కోరుకోవడం లేదని, ప్రతిపక్ష నాయకులను ఏకం చేసి ముందుకు సాగుతామని నితీష్ కుమార్ గతంలో చెప్పారు.


More Telugu News