ద్వంద్వ ప్రమాణాల ప్రపంచం: గ్లోబల్ నార్త్‌పై జైశంకర్

  • మార్పు కోసం రాజకీయ సంకల్పం కంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందన్న జైశంకర్
  • భద్రతా మండలిలో ఇలాంటి తీరును ఎక్కువగా గమనిస్తామని వ్యాఖ్య
  • సంపూర్ణ పరివర్తన కోసం గ్లోబల్ సౌత్ ఒత్తిడి తెస్తుంటే గ్లోబల్ నార్త్ అడ్డుకుంటుందన్న జైశంకర్
ఇప్పటికీ ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమేనని, ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్న దేశాలు మార్పు కోసం ఒత్తిడిని ప్రతిఘటిస్తున్నాయని, చారిత్రక ప్రభావం ఉన్నవారు ఆ సామర్థ్యాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అసహనం వ్యక్తం చేశారు. న్యూయార్క్ వేదికగా ఆయన పశ్చిమ దేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి, యూఎన్ ఇండియా, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సౌత్ రైజింగ్: పార్ట్‌నర్‌షిప్స్, ఇనిస్టిట్యూషన్స్, అండ్ ఐడియాస్' సమావేశంలో మాట్లాడారు.

మార్పు కోసం రాజకీయ సంకల్పం కంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆధిపత్య స్థానాల్లో ఉన్న దేశాలు మార్పును ప్రతిఘటిస్తున్నాయన్నారు. భద్రతా మండలిలో ఇలాంటి తీరును ఎక్కువగా గమనిస్తుంటామన్నారు. ఆర్థిక ఆధిపత్యం కలిగినవారు తమ ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటారని, సంస్థాగత లేదా చారిత్రక ప్రభావం ఉన్నవారు ఆ సామర్థ్యాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారన్నారు. వారు సరైన విషయాలే చెబుతారు కానీ, వాస్తవమేమంటే ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమన్నారు. ఇందుకు కోవిడ్ మంచి నిదర్శనమన్నారు.

సంపూర్ణ పరివర్తన కోసం అంతర్జాతీయ వ్యవస్థ పై గ్లోబల్ సౌత్ మరింత ఒత్తిడిని తెస్తోందన్నారు. కానీ గ్లోబల్ నార్త్, అలాగే మరిన్ని దేశాలు అడ్డుకుంటున్నాయన్నారు. సాంస్కృతిక బ్యాలెన్స్ అంటే వైవిధ్యాన్ని గుర్తించడం, గౌరవించడమే కాదని, ఇతర సంస్కృతులను, సంప్రదాయాలకు తగిన గౌరవం కూడా ఇవ్వాలన్నారు. కాగా, గ్లోబల్ నార్త్ అనే పదాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు, గ్లోబల్ సౌత్ అనే పదాన్ని అభివృద్ధి చెందుతోన్న, అభివృద్ధి చెందని దేశాలకు ఉపయోగిస్తారు.


More Telugu News