కడియం శ్రీహరికి, తనకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు: ఎమ్మెల్యే రాజయ్య

  • తనకు టిక్కెట్ రాకపోతే బరిలో నిలిచే అంశాన్ని కాలం నిర్ణయిస్తుందని వ్యాఖ్య
  • కడియంతో కలవలేదు.. కార్యకర్తలు నిరుత్సాహపడవద్దన్న ఎమ్మెల్యే
  • బీఫామ్ తనకే వస్తుందని రాజయ్య ధీమా
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాను కలిసిపోయినట్లుగా వచ్చిన వార్తలపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం స్పందించారు. ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తనకు టిక్కెట్ రాకపోతే తాను బరిలో నిలిచే అంశం కాలం నిర్ణయిస్తుందన్నారు. తనకు, కడియంకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని సూచించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించారని, కానీ ఎక్కడా బీఫామ్ ఇవ్వలేదన్నారు.

నివేదికలు, సర్వేల ప్రకారం మున్ముందు మార్పులు ఉండవచ్చునన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ కేటాయింపు ప్రకటన పట్ల అసంతృప్తి ఉందన్నారు. తాను జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటానని, తాను ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లే సమయంలో తాను కలిశానని, తాను బాగా చేస్తున్నానంటూ ప్రశంసించారన్నారు. టిక్కెట్ తనకే వస్తుందని హామీ ఇచ్చారన్నారు. తనకు ఎమ్మెల్సీగా లేదా ఎంపీగా కూడా అవకాశం ఉంటుందని చెప్పారన్నారు.

కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడంతో రాజయ్య కాంగ్రెస్‌లోకి వెళ్తారా? అనే చర్చ సాగింది. దీనిపై రాజయ్య స్పందిస్తూ.. తాను అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.


More Telugu News