మల్కాజిగిరిని వదిలే ప్రసక్తే లేదు: మైనంపల్లి హనుమంతరావు

  • ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తారంటూ అసత్య ప్రచారం జరుగుతోందన్న మైనంపల్లి
  • తనకు వ్యతిరేకంగా ఓ సిస్టమే పని చేస్తోందని ఆరోపణ
  • క్యాడర్ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా వెనుకాడబోనని వ్యాఖ్య
తాను మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలను తాను వదిలిపెట్టే ప్రస్తకే లేదన్నారు. మైనంపల్లి తన కుమారుడు రోహిత్ కు మెదక్‌ అసెంబ్లీ సీటు ఆశించారు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న మైనంపల్లి రెండు రోజుల కిందట బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. తనకు ఇచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్‌ను నిరాకరిస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. 

ఈ నేపథ్యంలో తాను మల్కాజిగిరి సెగ్మెంట్‌ను వదులుకుంటున్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మైనంపల్లి ఆరోపించారు. మల్కాజిగిరి ప్రజలను తప్పుతోవ పట్టించడానికి, తనకు వ్యతిరేకంగా ఓ సిస్టమే పనిచేస్తుందన్నారు. తాను కుత్బుల్లాపూర్, మేడ్చల్ నుంచి పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలో వాస్తవం లేదన్నారు. తాను, తన కుమారుడు రాజకీయలతో బతికేవారిమి కాదని, తనకు తమ కార్యకర్తలు, ప్రజలే ముఖ్యమన్నారు. క్యాడర్ కోసం ప్రాణాలిస్తానని అన్నారు. కాగా, మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.


More Telugu News