తెలంగాణలో 15 లక్షల కొత్త ఓట్ల నమోదు: ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఈవో మీడియా సమావేశం
  • ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం మిగిలుందన్న వికాస్ రాజ్
  • ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడి 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని పేర్కొన్నారు. అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని వికాస్ రాజ్ వివరించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో చిరునామాల మార్పుపై ఫిర్యాదులు అందాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి 15 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. వారిలో 6.99 లక్షల మంది యువ ఓటర్లని తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామని వికాస్ రాజ్ పేర్కొన్నారు. 

ఇక, అక్టోబరు మొదటివారంలో తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తుందని అన్నారు. హైదరాబాదులోని బీఆర్కే భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వివరాలు వెల్లడించారు.


More Telugu News