వివేక్ రామస్వామితో విందు, ఒక్కో టిక్కెట్ ఖరీదు రూ.41 లక్షలు!

  • ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తల ప్రత్యేక కార్యక్రమం
  • పది లక్షల డాలర్ల సేకరణ లక్ష్యంగా కార్యక్రమ నిర్వహణ
  • ఈ నెల 29న వివేక్ రామస్వామి ప్రత్యేక అతిథిగా విందు ఏర్పాటు
అమెరికా అధ్యక్ష రేసులో దూసుకెళ్తోన్న రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పలువురు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 29న వివేక్ రామస్వామి ప్రత్యేక అతిథిగా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందులో పాల్గొనాలనుకునే వారు 50 వేల డాలర్ల నుంచి ఆ పైన చెల్లించవలసి ఉంటుంది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు రూ.41 లక్షలకు పైగా ఉంటుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో చామత్ పలిహపిటియా నివాసంలో ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పలువురు వ్యాపారవేత్తలు భాగస్వాములయ్యారు.

ఈ విందు కార్యక్రమం సందర్భంగా వివేక్ రామస్వామి చర్చలకూ అవకాశం కల్పిస్తారు. పది లక్షల డాలర్ల సేకరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వివేక్ రామస్వామి సంచలన హామీలు ఇస్తున్నారు. ప్రభుత్వంలో 75 శాతం ఉద్యోగులను తొలగిస్తామని, ఎఫ్‌బీఐని మూసివేస్తామని చెబుతున్నారు. లాటరీ ఆధారిత హెచ్1బీ వీసా ప్రక్రియను పక్కన పెట్టి ప్రతిభ ఆధారిత విధానం తీసుకు వస్తామన్నారు. భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. అప్పుడే చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్య్రం పొందుతుందని ఆయన చెప్పారు. 


More Telugu News