అవయవ దానం చేస్తే.. తమిళనాడులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

  • రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటన
  • అవయవ దానాల్లో తమిళనాడు ముందంజలో ఉందన్న సీఎం
  • 2022లో 154  అవయవ దానాలతో రెండో స్థానంలో తమిళనాడు
తమిళనాడు సర్కారు ఆదర్శప్రాయమైన నిర్ణయాన్ని తీసుకుంది. అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అవయవ దానంలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ సందర్భంగా స్టాలిన్ పేర్కొన్నారు. అవయవదానం వందలాది మందికి కొత్త జీవితాలను ఇస్తున్నట్టు చెప్పారు.

‘‘విషాదకరమైన పరిస్థితుల్లో తమ ఆత్మీయుల (బ్రెయిన్ డెడ్ తదితర) అవయవ దానానికి ముందుకు వచ్చేవారి నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత (తమిళనాడు ముందంజ) సాధ్యమైంది’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. అవయవ దానం చేసిన వారి త్యాగాన్ని గౌరవిస్తూ తమిళనాడు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

కానీ, 2022 సంవత్సరానికి దేశంలో అత్యధిక అవయవ దానాలు తెలంగాణ రాష్ట్రంలో నమోదు కావడం గమనార్హం. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో గతేడాది 194 అవయవ దానాలు జరిగాయి. ఆ తర్వాత 154 అవయవదానంతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


More Telugu News