మీ హెల్త్ పాలసీని మరో కంపెనీకి మారుస్తున్నారా..?

  • మొబైల్ నంబర్ మాదిరే హెల్త్ ప్లాన్ పోర్టబులిటీ
  • సేవలు సరిగ్గా లేకపోయినా, ప్రీమియం ఎక్కువైనా మారిపోవచ్చు
  • పాలసీ రెన్యువల్ కు 45-60 రోజుల ముందు సంప్రదించాలి
నేడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందే. హెల్త్ ప్లాన్ తీసుకున్న తర్వాత కంపెనీ సేవలు నచ్చనప్పుడు, అప్పటికే ఉన్న ప్లాన్ లో సదుపాయాలు సమగ్రంగా లేవని అనిపించినప్పుడు అదే కంపెనీతో కొనసాగాలని లేదు. మరో సంస్థకు పోర్ట్ పెట్టుకుని మెరుగైన కవరేజీ ఉన్న వేరే ప్లాన్ లోకి మారిపోవచ్చు. ఇందుకు చట్టం అనుమతిస్తోంది. 

కంపెనీ క్లెయిమ్ చెల్లింపు సేవలు చాలా నిదానంగా ఉన్నప్పుడు, కంపెనీ నుంచి ఆశించిన స్పందన లేనప్పుడు, క్లెయిమ్ లలో తరచూ కోత పెడుతున్నప్పుడు ఆ కంపెనీ నుంచి వేరొక కంపెనీకి మారిపోవడం మంచిది. అలాగే, ప్రీమియం చాలా ఎక్కువగా ఉండి, సమగ్ర కవరేజీతో తక్కువ ప్రీమియానికే వేరే కంపెనీ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే పోర్ట్ తో మారిపోవచ్చు. పోర్టింగ్ పెట్టుకునే వారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

  • పోర్టింగ్ ఏడాదిలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటు. పాలసీ ప్రీమియం చెల్లింపు గడువు లేదా పాలసీ ఎక్స్ పైరీ తేదికి 45-60 రోజుల ముందు ఈ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. 
  • ఒక సాధారణ/ఆరోగ్య బీమా సంస్థ నుంచి మరో సాధారణ/ఆరోగ్య బీమా సంస్థకు మారిపోవచ్చు. 
  • పాలసీ రెన్యువల్ కు 45-60 రోజుల ముందు కొత్త కంపెనీని సంప్రదించాలి. వారు అడిగిన డాక్యుమెంట్లను సమర్పించాలి. తాము దరఖాస్తు స్వీకరించినట్టు బీమా సంస్థ నుంచి మీకు మూడు రోజుల్లోగా అకనాలెడ్జ్ మెంట్ వస్తుంది. అక్కడి నుంచి 15 రోజుల్లోపు పోర్టింగ్ ను క్లియర్ చేయాలి.
  • ఒకవేళ దరఖాస్తు సమర్పించి 15 రోజులు గడిచినా స్పందన లేకపోతే.. అప్పుడు తన పాలసీని ఒక నెల కాలానికి పొడిగించాలని పాత సంస్థను కోరొచ్చు. 
  • కొన్ని సందర్భాల్లో కొత్త సంస్థ పోర్టింగ్ దరఖాస్తును తిరస్కరించొచ్చు. అలాంటి సందర్భాల్లో పాత బీమా కంపెనీ వద్దే తమ ఇన్సూరెన్స్ కవరేజీని కొనసాగించుకోవాలి. 
  • పోర్టింగ్ కు ఎలాంటి చార్జీలు ఉండవు. పోర్టింగ్ తో మారే సమయంలో కొత్త సంస్థకు తమ ఆరోగ్యం గురించి సమగ్ర వివరాలు ఇవ్వాలి. 


More Telugu News