మైదానంలో కంటే ఇంటి దగ్గరే ఎక్కువ ప్రాక్టీస్: షమీ

మైదానంలో కంటే ఇంటి దగ్గరే ఎక్కువ ప్రాక్టీస్: షమీ
  • ఆస్ట్రేలియాతో వన్డేలో ఐదు వికెట్లతో రాణించిన షమీ
  • ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం అలవాటైందన్న బౌలర్
  • తన డిక్షనరీలో విశ్రాంతి అంటే అర్థం వేరన్న షమీ
మహమ్మద్ షమీ మరోసారి తనదైన మార్క్ చూపించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టి, భారత్ విజయాన్ని ముందే ఖాయం చేశాడు. మొదటి ఓవర్లోనే మిచెల్ మార్ష్ వికెట్ తీసి ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాడు. పిచ్ పరిస్థితులు అంతగా సానుకూలించకపోయినా షమీ చేసిన ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. కొత్త బాల్ తో అలసిపోయినట్టుగా కనిపించిన షమీ.. అదే జోరుతో బౌలింగ్ ఎలా కొనసాగించగలిగాడంటే? అది అనుభవంతోనే సాధ్యమని షమీ బదులిచ్చాడు.

 ‘‘వేడి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. మనం మనుషులం. కనుక శరీరంపై ప్రభావం పడుతుంది. కానీ, ఎంతో కాలంగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడుతున్నందున అలాంటి సందర్భాలను ఎదుర్కోవడం నాకు అలవాటైంది. వికెట్ల నుంచి స్పందన లేనప్పుడు బాల్ తో అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లు.. షార్ట్ స్పెల్స్ కూడా వేయగలరు’’ అని షమీ వివరించాడు. వన్డే ర్యాంకుల్లో నంబర్ 1 బౌలర్ గా ఉన్నప్పటికీ షమీ.. వరుసగా ఎనిమిది నెలల పాటు నాన్ స్టాప్ గా ఆడాల్సి రావడంతో.. వెస్టిండీస్ పర్యటనకు విశ్రాంతి కల్పించడం తెలిసిందే. కానీ, విశ్రాంతి అనే పదాన్ని షమీ అంగీకరించలేదు. తన డిక్షనరీలో విశ్రాంతి అంటే అర్థం వేరని తెలిపాడు. భారత జట్టుతో ఉన్నప్పటి కంటే ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహలో ఇంటి వద్ద మరింత ఎక్కువ సాధన చేసినట్టు షమీ వెల్లడించాడు. ఇందుకు తన ఇంటివద్ద  తగిన ఏర్పాట్లు ఉన్నట్టు చెప్పాడు.


More Telugu News