ప్రపంచంలోకెల్లా అత్యధిక దూరం ప్రయాణించగల యుద్ధ డ్రోన్లను ప్రదర్శించిన ఇరాన్

  • యుద్ధ వార్షికోత్సవం నేపథ్యంలో టెహ్రాన్ లో మిలిటరీ పరేడ్
  • మొహాజిర్-10 డ్రోన్లను పరిచయం చేసిన ఇరాన్
  • ఒక్కసారి గాల్లోకి లేస్తే ఏకబిగిన 24 గంటల గగన విహారం
  • 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సత్తా
  • 300 కిలోల పేలోడ్ తో శత్రుభీకరంగా మొహాజిర్-10
చవకగా, ప్రమాదకర డ్రోన్లను తయారుచేయడంలో ఇరాన్ ది అందెవేసిన చేయి. ప్రపంచంలో చాలా దేశాలు ఇరాన్ తయారీ డ్రోన్లను ఉపయోగిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధరంగంలోనూ ఇరాన్ తయారీ షాహెద్ డ్రోన్లు పాలుపంచుకున్నాయి. 

తాజాగా ఇరాన్ తన డ్రోన్ల సామర్థ్యాన్ని భారీగా పెంచేసింది. ఇప్పుడు ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్లు ప్రపంచంలోనే అత్యధిక దూరం ప్రయాణించగలవు. 24 గంటల వ్యవధిలో 2 వేల కిలోమీటర్లు ప్రయాణించగల మొహాజిర్-10 డ్రోన్లను ఇరాన్ యుద్ధ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్ లో ప్రదర్శించింది. 

అభివృద్ధి పరిచిన మొహాజిర్ డ్రోన్ ఒక్కసారి గాల్లోకి లేచాక ఏకబిగిన రోజంతా విహరించగలదు. తక్కువ ఎత్తులో ప్రయాణించే వీలుండడంతో దీన్ని రాడార్లు కూడా గుర్తించలేవు. ఒకవేళ శత్రుబలగాలు ఆ డ్రోన్లను కూల్చివేసినా, యుద్ధ  విమానాల కూల్చివేతతో పోల్చి చూస్తే పెద్దగా ఆర్థిక నష్టం ఉండదు. ముఖ్యంగా, ఇవి మానవరహితం కాబట్టి ప్రాణనష్టం ప్రమాదం ఏమాత్రం ఉండదు. 

మొహాజిర్-6తో పోల్చితే మొహాజిర్-10 డ్రోన్ అత్యంత శక్తిమంతమైనది. ఇది 300 కిలోల పేలోడ్ ను మోసుకెళ్లగలదు. సంప్రదాయ యుద్ధతంత్రాలకు కాలం చెల్లిందని నిరూపిస్తూ, ఆధునిక యుద్ధరీతులకు ఈ వార్ డ్రోన్లు సిసలైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

కాగా, తన మిలిటరీ పరేడ్ లో ఇరాన్ మరింత అభివృద్ధి పరిచిన షాహెద్, అరాష్ డ్రోన్లను కూడా ప్రదర్శించింది.


More Telugu News