ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు అనుమతి నిరాకరించిన చైనా

  • రేపటి నుంచి చైనాలో ఆసియా క్రీడలు
  • ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్ల వీసాల తిరస్కరణ
  • తీవ్రంగా స్పందించిన భారత్
  • రేపటి చైనా పర్యటన రద్దు చేసుకున్న క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ 
ఈ ఏడాది ఆసియా క్రీడలకు చైనా అతిథ్యమిస్తోంది. చైనాలోని హాంగ్ జౌ నగరంలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అయితే, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలోని ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు చైనా అనుమతి నిరాకరించింది. భారత క్రీడాకారులకు అనుమతి నిరాకరించడంపై చైనా వర్గాలు భారత ప్రభుత్వానికి సమాచారం అందించాయి. 

ఈ పరిణామంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఆసియా క్రీడోత్సవాల స్ఫూర్తిని చైనా ఉల్లంఘించిందని విమర్శించింది. అటు, రేపు చైనా వెళ్లాల్సిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 

అయితే, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఎథిక్స్ ప్యానెల్ చైర్మన్ వీ జిఝాంగ్ వాదన మరోలా ఉంది. చైనాలో అడుగుపెట్టేందుకు భారత అథ్లెట్లకు వీసాలు మంజూరు చేశారని, ఆ వీసాలను చైనా ప్రభుత్వం నిరాకరించిందనడం వట్టిదేనని అన్నారు. దురదృష్టవశాత్తు భారత అథ్లెట్లే ఆ వీసాలను తాము అంగీకరించబోమని చెప్పారని వీ జిఝాంగ్ వెల్లడించారు. 

ఈ పరిణామాలతో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఢిల్లీలోని, బీజింగ్ లోనూ దౌత్యపరమైన మార్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

చైనా ఎప్పటినుంచో అరుణాచల్ ప్రదేశ్ ను తమ అంతర్భాగమని పేర్కొంటోంది. ఆ మేరకు అరుణాచల్ ప్రదేశ్ కూడిన మ్యాపులను విడుదల చేస్తోంది. చైనా ప్రయత్నాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.


More Telugu News