ఎవరికీ కనిపించని అవినీతి జగన్ కు ఎందుకు కనిపిస్తోంది?: పయ్యావుల

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను తిప్పికొడుతున్న టీడీపీ నేతలు
  • మరోసారి మీడియా ముందుకు వచ్చిన పయ్యావుల
టీడీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారంలో స్పందించారు. ఎవరికీ కనిపించని అవినీతి జగన్ కే ఎందుకు కనిపిస్తోందని విమర్శించారు. స్కిల్ కేసులో డబ్బు ఎక్కడికీ వెళ్లినట్టు నిరూపణ కాలేదని అన్నారు. రివర్స్ టెండరింగ్ లాగా ఇది రివర్స్ ఇన్వెస్టిగేషన్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

అవినీతికి పాల్పడబోమని సంతకం చేస్తేనే ఒప్పందాలు జరుగుతాయని, నిధుల విడుదలలో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. అధికారులు కూడా ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. నిధుల విడుదలలో ప్రేమ్ చంద్రారెడ్డి జాగ్రత్తగా వ్యవహరించారని, ఐదు విడతలుగా నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. 

1997 తర్వాత దేశంలో సీమెన్స్ కార్యకలాపాలు బాగా విస్తరించాయని పయ్యావుల తెలిపారు. స్కిల్ ప్రాజెక్టు కోసం నలుగురు అధికారుల బృందం గుజరాత్ వెళ్లి పరిశీలించి రిపోర్టు ఇచ్చిందని పయ్యావుల వెల్లడించారు. 40 సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ ఇచ్చామని, ఎక్కువమంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. 

సీమెన్స్ టెక్నాలజీ ద్వారా అనేక లాభాలు కలిగాయని పయ్యావుల వివరించారు. సీమెన్స్ ఇచ్చే నైపుణ్య శిక్షణను అబ్దుల్ కలాం కూడా ప్రశంసించారని వెల్లడించారు. 17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని పయ్యావుల ఆరోపించారు. 

స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో అసలు అవినీతే జరగలేదని ఉద్ఘాటించారు. స్కిల్ డెవలప్ మెంట్ మొత్తం రూ.3,300 కోట్ల ప్రాజెక్టు అని, రూ.371 కోట్ల నిధుల్లో ప్రతి రూపాయి ఎవరికీ ఎలా వెళ్లాయో వివరాలు ఉన్నాయని తెలిపారు. సీఎం, మంత్రిమండలి కేవలం పాలసీ మేకింగ్ వరకే పరిమితమని అన్నారు. ఏ పాలసీ అయినా అమలు బాధ్యత పూర్తిగా అధికారులదేనని అన్నారు.


More Telugu News