మావోడికి చెబుతున్నా.. ఎమ్మెల్యేగా గెలవరా బాబు, కనీసం కార్పోరేటర్‌గా అయినా గెలిస్తే తెలుస్తుంది: పేర్ని నాని సెటైర్లు

  • పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పేర్ని నాని చురకలు
  • చంద్రబాబు సంతకాలు పెట్టలేదని చెబుతున్నాడు కానీ 13 చోట్ల పెట్టారని తెలుసుకోవాలని హితవు
  • చంద్రబాబును డేరాబాబాతో పోలుస్తూ మాట్లాడిన పేర్ని నాని
ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై పేర్ని నాని మాట్లాడుతూ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చురకలు అంటించారు. 'ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగానే మావోడు ఒకడు తగుదునమ్మా అని వచ్చాడు.. ఆదరాబాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చాడు. జైలు వద్దకు వచ్చి ఆయన అంటాడు... జగన్ గారూ, మీకు తెలియదా సీఎం గారు మౌఖిక ఆదేశాలు ఇస్తారు తప్ప సంతకాలు పెట్టరని, ఇది తెలుసుకో అని అతను మాకు చెబుతున్నాడు. అరె బాబూ ఒకసారి ఎమ్మెల్యేగా గెలవరా బాబూ.. కనీసం కార్పోరేటర్‌గా గెలిస్తే ఎవరు ఎక్కడ సంతకాలు పెడతారో తెలుస్తుంది' అని ఎద్దేవా చేశారు.

మావోడికి చెబుతున్నాను, జైలు వద్దకు వచ్చి చంద్రబాబు సంతకాలు పెట్టలేదని చెబుతున్నాడు, కానీ అదే చంద్రబాబు స్కిల్ కేసులో 13 చోట్ల సంతకాలు పెట్టారని తెలుసుకోవాలన్నారు. అధికారులు చెప్పినా వినలేదని, రూల్స్ గురించి చెప్పినా సంతకాలు మాత్రం పెట్టలేదని మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోవైపు సంతకాలు పెట్టిన చంద్రబాబేమో తనకు తెలియదని విచారణలో చెబుతున్నారన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పేదల ఆశలను చంద్రబాబు అడియాసలు చేశారన్నారు. ఈ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెబుతోందని, కానీ డొల్ల కంపెనీల ప్రతినిధులను మాత్రం విచారణ సంస్థలు అరెస్ట్ చేశాయన్నారు. ఈ కేసులో స్కాం జరిగిందని ఈడీ కేసు ఎందుకు పెట్టిందో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఆడించిన పాత్రదారులు అందరూ జైలుకు వెళ్లారని, ఇప్పుడు అసలు సూత్రదారి చంద్రబాబు వెళ్లారన్నారు. ఈ దొంగతనంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

డేరాబాబాతో పోలుస్తూ విమర్శలు

40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారని, కానీ అందరికీ న్యాయం ఒక్కటే అన్నారు. పంజాబ్‌లో డేరా బాబా అనే ఒకవ్యక్తి ఉండేవారని, ఆయనకు వేలాది మంది శిష్యులు ఉన్నారని, అతనికి కూడా చంద్రబాబులా నటించాలనే కోరిక ఉండేదన్నారు. రాజమండ్రి పుష్కరాల సమయంలో చంద్రబాబు ఎలా అయితే నటించాలనే కోరికను తీర్చుకున్నారో, డేరాబాబుకు కూడా సినిమాల్లో నటించాలనే కోరిక ఉందన్నారు. కానీ నేరం చేసినప్పుడు చట్టం, న్యాయం డేరా బాబాను కూడా అరెస్ట్ చేసిందన్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్నారు. నూరు గొడ్లను తిన్న రాబందు రోజూ దొరకకపోవచ్చునని, కానీ, ఎప్పటికైనా నేలకు ఒరుగుతుందన్నారు. విచారణ పూర్తయ్యాక అందరికీ చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. అలాగే వారి పాలనలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో.. అన్నింటిపై విచారణ జరిపి, నేరస్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.



More Telugu News