గ్రౌండ్ మెన్ కు సిరాజ్ బహుమానం.. విచారణకు అర్జున రణతుంగ డిమాండ్

  • ఆసియా కప్ మ్యాచ్ లకు తరచూ వర్షం ఆటంకం
  • ఎంతో కష్టించిన మైదానం సిబ్బంది
  • వారి కష్టానికి గుర్తింపుగా ఏసీసీ, సిరాజ్ నుంచి బహుమానాలు 
  • దీని వెనుక ఏదో ప్రేరణ ఉందంటూ సందేహం
ఎన్నో మార్లు వర్షాలు ఆటంకం కలిగించినా ఆసియా కప్ 2023 విజయవంతంగా ముగిసింది. భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై అలవోకగా భారత్ గెలిచింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఒక్కడే ఆరు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అయితే ఆసియా కప్ విజయం సాధించడంలో శ్రీలంక గ్రౌండ్స్ మెన్ (మైదానం సిబ్బంది) కృషి ఎంతో ఉందని చెప్పుకోవాలి. ప్రతి మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించడం, వారు పరదాలతో ఎన్నో పర్యాయాలు పరుగెత్తుకు వచ్చి పిచ్ లను కప్పేయడం, మళ్లీ తొలగించడం నిత్యకృత్యంగా మారింది.

వారి కృషికి గుర్తింపుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) 50,000 డాలర్ల బహుమానాన్ని ప్రకటించింది. మరోపక్క, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కింద తనకు వచ్చిన 50,000 డాలర్లను సైతం సిరాజ్ వారికే ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఎంతో మంది మెచ్చుకున్నారు. కానీ, శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏసీసీ, సిరాజ్ నిర్ణయాల పట్ల రణతుంగ సంతోషంగా లేనట్టు కనిపిస్తోంది.

ఈ నిర్ణయం వెనుక ఏదో ప్రేరణ దాగుందని, దాన్ని వెలికితీయాలంటూ మీడియాను రణతుంగ కోరాడు. ఈ స్థాయి చెల్లింపులను శ్రీలంక క్రికెట్ కూడా ఏనాడూ చెల్లించలేదన్నాడు. ‘‘నా నుంచి ఒకటే ప్రశ్న. శ్రీలంకలో ఎన్నో టీమిండియా పర్యటనలు జరిగాయి. వారికి నగదు బహుమతి ఇవ్వడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నగదును దొంగిలించకుండా, ఎవరో ఒకరికి ఇస్తే నాకు సంతోషమే. అయితే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సైతం చివర్లో తన ప్రైజ్ మనీని ఇచ్చాడు. గ్రౌండ్స్ మెన్ ఇన్నేళ్లుగా సేవలు అందించారు. అయినా శ్రీలంక క్రికెట్ యంత్రాంగం వారికి ఈ స్థాయి చెల్లింపులు చేయలేదు. దీని వెనుక ఉన్న వాస్తవాలను మీడియా విచారించాలి’’ అని రణతుంగ కోరాడు.


More Telugu News