కెనడాతో వివాదంలో భారత్‌కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు.. అమెరికా స్పష్టీకరణ

  • భారత్-కెనడా దౌత్యవివాదంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ స్పందన 
  • వివాదంపై ఇరు దేశాలతో చర్చిస్తున్నామని వెల్లడి
  • విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టీకరణ
  • ఈ వివాదంలో భారత్‌కు ప్రత్యేక మినహాయింపులేవీ ఉండవని కామెంట్
ఖలిస్థానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా గురువారం తాజాగా స్పందించింది. రెండు దేశాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కెనడా పౌరుడైన నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే.

‘‘ఈ అంశంపై ప్రైవేటుగా జరిగిన దౌత్య చర్చల లోతుల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. ఈ అంశంపై భారత్‌తో మేము ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని జేక్ సల్లివన్ పేర్కొన్నారు. కెనడా వివాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీతో మాట్లాడారా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. 

‘‘ఈ అంశంపై మాకూ ఆందోళన ఉంది. దీన్ని మేము తీవ్రంగానే పరిగణిస్తున్నాం. కేసుపై దృష్టిసారించాము. ఈ అంశంలో ఇండియాకు ప్రత్యేకమైన మినహాయింపు ఏదీ ఉండదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


More Telugu News