ఇండియాలోని యాపిల్ అభిమానులకు శుభవార్త.. ప్రారంభమైన ఐఫోన్ 15 అమ్మకాలు

  • ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైన అమ్మకాలు
  • ప్రీ ఆర్డర్ షిప్పింగ్ కూడా నేటి నుంచి మొదలు
  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై ఆఫర్లు
  • స్టోర్ల ముందు జనం బారులు
భారత్‌లోని యాపిల్ అభిమానులకు ఇది శుభవార్తే. ఇటీవల విడుదలైన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే స్టోర్లు, యాపిల్ వెబ్‌సైట్‌లో వీటి విక్రయాలు మొదలయ్యాయి. విషయం తెలిసిన జనం ఉదయం నుంచే యాపిల్ స్టోర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. దీంతో యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి ఇండియా సహా 40 దేశాల్లో ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రీ ఆర్డర్ షిప్పింగ్ ప్రారంభం కానుంది. 

ఐఫోన్ 15 ధరలు ఇలా.. 
యాపిల్ ఇటీవల ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రొ, 15 ప్రొ మ్యాక్స్‌ వేరియంట్లను విడుదల చేసింది. ఐఫోన్ 15, 15 ప్లస్  128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో, పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 128 జీబీ బేస్ స్టోరేజీ ఐఫోన్ 15 ధర రూ. 79,900 కాగా, 15 ప్లస్ ధర రూ. 89,900. ఐఫోన్ 15 ప్రొ 128 జీబీ వేరియంట్ ధర రూ. 1,34,900 నుంచి ప్రారంభం కానుండగా, ప్రొ మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ ధర రూ. 1,59,900గా ఉంది. 

యాపిల్ తొలిసారి యూఎస్‌బీ-సిటైప్ చార్జర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్లతోపాటు విడుదల చేసిన యాప్ వాచ్ సిరీస్ 9 ధర రూ. 41,900 కాగా, యాపిల్ వాచ్ ఎస్ఈ (సెకండ్ జనరేషన్) ధర రూ. 29,900.  ఫోన్ల కొనుగోలుపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ యాపిల్ ఆఫర్లు ప్రకటించింది.


More Telugu News