తన వద్ద 900 యూరోలు మాత్రమే ఉన్నాయన్న భారత టెన్నిస్ ఆటగాడు... అండగా నిలిచిన పెప్సీకో!

  • టెన్నిస్ సర్క్యూట్లో ఎక్కువగా వినిపిస్తున్న భారత క్రీడాకారుడి పేరు సుమిత్ నాగల్
  • ఏటీపీ టూర్లో ఆడేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదన్న నాగల్
  • ఓ సీజన్ లో ఆడాలంటే కనీసం రూ.1 కోటి ఉండాలని వెల్లడి
  • మూడేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచేందుకు పెప్సీకో నిర్ణయం
ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ ఓ ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని చెప్పడంపై తీవ్రస్థాయిలో స్పందన వచ్చింది. 

ఏటీపీ టూర్లో ఓ సీజన్ ఆడాలంటే కనీసం కోటి రూపాయలకు తక్కువ కాదని, కానీ తన వద్ద ఉన్న డబ్బు 900 యూరోలేనని (భారత కరెన్సీలో రూ.80 వేలు మాత్రమే) సుమిత్ నాగల్ వెల్లడించాడు. మహా టెన్నిస్ ఫౌండేషన్ తో కలిసి ప్రశాంత్ సుతార్ సాయపడుతున్నాడని, ఐఓసీఎల్ ఉద్యోగిగా నెల జీతం మాత్రం అందుతోందని నాగల్ వివరించాడు.  

భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సుమిత్ నాగల్ తన దయనీయ పరిస్థితిని బయటపెట్టేసరికి, దాతలు పెద్ద ఎత్తున స్పందించారు. ఢిల్లీ టెన్నిస్ సంఘం (డీఎల్ టీఏ) రూ.5 లక్షల సాయం ప్రకటించింది. బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీకో ఇండియా మూడేళ్లపాటు సుమిత్ నాగల్ కు ఆర్థిక అండదండలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. 

తమ గెటోరేడ్ ఎనర్జీ డ్రింక్ ప్రచారకర్తగా అతడిని నియమించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు పెప్సీకో ఎనర్జీ అండ్ హైడ్రేషన్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ వెల్లడించారు. 

దీనిపై నాగల్ స్పందిస్తూ, గెటోరేడ్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నానని, తన పరిస్థితి పట్ల పెప్సీ కో స్పందించిన తీరు కదిలించివేసిందని తెలిపాడు. తన కెరీర్ కీలక దశలో ఈ భాగస్వామ్యం లభించిందని వివరించాడు. ఆట పట్ల తపన, కఠోర శ్రమ వల్తే తనకు ఈ గుర్తింపు లభించిందని నాగల్ పేర్కొన్నాడు.


More Telugu News