విమానం ల్యాండవుతుండగా డోర్ తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చితకబాదిన ప్రయాణికులు

  • హైదరాబాద్ నుంచి అగర్తల వెళుతున్న విమానం
  • అగర్తలలో ల్యాండయ్యే సమయంలో అనూహ్య ఘటన
  • తలుపు తీయబోయిన వ్యక్తిని అడ్డుకున్న ఎయిర్ హోస్టెస్
  • విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి
  • దేహశుద్ధి చేసిన ఇతర ప్రయాణికులు... తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలు
ఓ ఇండిగో విమానం ల్యాండవుతుండగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రయాణికుడి పేరు బిశ్వజిత్ దేబ్ నాథ్. 41 ఏళ్ల దేబ్ నాథ్ త్రిపురలోని తూర్పు అగర్తల ప్రాంతానికి చెందినవాడు.

దేబ్ నాథ్ హైదరాబాద్ నుంచి గువాహటి మీదుగా అగర్తలా వెళుతున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు. అయితే అగర్తలలో విమానం మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా, ఆ వ్యక్తి తన సీట్లోంచి పరుగున వెళ్లి విమానం తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. ఓ ఎయిర్ హోస్టెస్ దేబ్ నాథ్ ప్రయత్నాన్ని పసిగట్టి, అతడిపైకి దూకింది. ప్రయాణికుల సాయంతో అతడిని వెనక్కి లాగేసింది. 

అపై, దేబ్ నాథ్ విమాన సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అతడు తన వైఖరి మార్చుకోకుండా, డోర్ హ్యాండిల్ తీసేందుకు ప్రయత్నించడంతో ఇతర ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. తీవ్ర గాయాల పాలైన దేబ్ నాథ్ ను సీఐఎస్ఎఫ్ పోలీసులు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అనంతరం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

అతడిపై అగర్తల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దేబ్ నాథ్ డ్రగ్స్ కు బానిస అయ్యుంటాడని భావిస్తున్నారు. కాగా, విమానంలో జరిగిన గొడవలో ఇద్దరు ఇండిగో సిబ్బంది కూడా గాయపడ్డారు.


More Telugu News