ఆసీస్ తో తొలి రెండు వన్డేలకు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతినివ్వడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ

  • ఈ నెల 22 నుంచి టీమిండియా-ఆసీస్ మూడు వన్డేల సిరీస్
  • వరల్డ్ కప్ ముందు సన్నాహాలు
  • కీలక ఆటగాళ్లు లేకుండానే తొలి రెండు వన్డేలు ఆడనున్న టీమిండియా
  • మూడో వన్డేకు జట్టులో చేరనున్న రోహిత్, కోహ్లీ, పాండ్యా, కుల్దీప్
వచ్చే నెలలో సొంతగడ్డపై వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా 3 మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నెల 22 నుంచి 27 వరకు సిరీస్ జరగనుంది. 

అయితే, ఆసీస్ తో తొలి రెండు వన్డేలకు టీమిండియా సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు. ఈ నిర్ణయంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు. 

ఎంతో కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ నాటికి మరింత నూతన శక్తితో సిద్ధంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని ద్రావిడ్ వివరించారు. బిజీగా ఉండే అంతర్జాతీయ షెడ్యూల్ లో తగినంత విశ్రాంతి లభిస్తే ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉంటారని అభిప్రాయపడ్డారు. 

కాగా, ఆసీస్ తో తొలి రెండు వన్డేలకు రోహిత్, కోహ్లీలతో పాటు హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు కూడా విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు మూడో వన్డేలో ఆడనున్నారు.


More Telugu News