కెనడాలో ఉగ్రవాదిని చంపింది మేమే: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
- సుఖ్దూల్ సింగ్ ను తామే అంతమొందించినట్టు ప్రకటన
- అతడు ఎంతో మంది జీవితాలను నాశనం చేసినట్టు ఆరోపణ
- శత్రువులు ఎక్కడ దాగినా ప్రశాంతంగా ఉండలేరని హెచ్చరిక
కెనడాలో ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్య తమ పనే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఖలిస్థాన్ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా అనుచరుడైన సుఖ్దూల్ సింగ్ కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో హత్యకు గురయ్యాడు. రెండు గ్యాంగుల మధ్య గొడవలో భాగంగా ఇది చోటు చేసుకుంది.
‘‘గ్యాంగ్ స్టర్లు అయిన గుర్లాల్ బ్రార్, విక్కీ మిడ్ ఖేరా హత్యల్లో సుఖ్దూల్ సింగ్ (సుఖ దునుకే) ప్రధాన పాత్ర పోషించాడు. సుఖ్దూల్ విదేశాల్లో ఉంటున్నా కానీ, వీరి హత్యలకు ప్రణాళిక రచించాడు’’ అని లారెన్స్ గ్యాంగ్ పేర్కొంది. సుఖ్దూల్ సింగ్ డ్రగ్స్ కు బానిస అయ్యి, ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నం కావడానికి కారకుడైనట్టు తెలిపింది. అతడు చేసిన పాపాలకు అంతిమ శిక్ష పడినట్టు పేర్కొంది.
దేవిందర్ బంబిహ గ్యాంగ్ కు చెందిన సుఖ్దూల్ సింగ్.. మరో గ్యాంగ్ స్టర్ అయిన సందీప్ నంగాల్ అంబియాను సైతం హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. భారత్ లో అయినా, మరో దేశంలో అయినా ప్రశాంతంగా ఉండలేరంటూ శత్రువులకు హెచ్చరిక జారీ చేసింది. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో భాగంగా అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ నిర్వహిస్తోంది.