సైబర్‌‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. మనకు తెలిసిన వారి ముఖం, గొంతుతో వాట్సప్​ వీడియో కాల్స్​తో మోసాలు

  • ఏఐని ఉపయోగించి కొత్త రకం మోసానికి తెరలేపిన స్కామర్లు
  • కొత్త నంబర్ల నుంచి వీడియో కాల్స్ చేసి డబ్బులు అడుగుతున్న వైనం
  • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసుల సూచన
కొత్త సాంకేతికతలు ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నాయో..  అవి నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి ప్రమాదకరంగా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం, ఆన్‌లైన్ చెల్లింపు సౌకర్యాలు పెరగడంతో భారత్ లో సైబర్ మోసాల కేసులూ పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు ఇప్పటిదాకా ఓటీపీ, నకిలీ బ్యాంక్ ఉద్యోగులు, ఎస్సెమ్మెస్ లాంటి ఉపాయాల ద్వారా ప్రజల డబ్బును ఆన్‌లైన్‌లో దోచేస్తున్నారు. ఇప్పుడు స్కామర్లు మరో కొత్త మార్గాన్ని రూపొందించారు. తమ మోసాల కోసం వాట్సప్ వీడియో కాల్ ఫీచర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పద్ధతిలో స్కామర్లు మనకు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు. ఆ కాల్‌ని లిఫ్ట్ చేస్తే స్క్రీన్‌పై  మన దగ్గరి బంధువు ముఖం, వారి గొంతు వస్తుంది. మాటల్లోకి దింపి డబ్బులు అడుగుతారు. 

స్కామర్లు ఏఐ సహాయంతో మన బంధువులు, స్నేహితులే వీడియో కాల్ చేసినట్లుగా అదే ముఖం, వాయిస్‌ని రూపొందిస్తున్నారు. వీడియోలో కాల్‌లో తెలిసిన వారే కనిపించడంతో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. గత నెలలో ఇలాంటి వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా పలు మోసాలు ఢిల్లీలో వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఢిల్లీ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఓ కేసులో వాట్సాప్‌లోని కొత్త నంబర్ నుంచి ఒక మహిళకు వీడియో కాల్ వచ్చింది. ఆమె భర్త ఫోటో, వాయిస్ కాల్‌లో ఉన్నాయి. వెంటనే ఆ మహిళ రూ.2 లక్షలు బదిలీ చేయాలని భార్యను కోరాడు. మరో కేసులో ఒక వ్యక్తి తన సన్నిహితుడి నుండి వీడియో కాల్ వచ్చిందనుకొని రూ. 85 వేలు మోసపోయాడు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. కొత్త నంబర్ల నుంచి వీడియో కాల్ వస్తే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.


More Telugu News