భారత్ తో పెట్టుకుంటే ఒంటరి కావాల్సిందే..!

  • ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యను సంచలనం చేయాలనుకున్న కెనడా
  • భారత్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు
  • ఆధారాలు బయటపెట్టకుండా అడ్డగోలు ప్రకటన
  • తగినంత మద్దతు లభించని వైనం
  • భారత్ తో భాగస్వామ్యానికి అగ్రరాజ్యాల ప్రాధాన్యం
  • భారత్ పాత్రను నిరూపిస్తేనే కెనడాకు దౌత్య విజయం 
ఒకవైపు 140 కోట్ల జనాభాతో, ప్రపంచంలో వేగంగా వృద్ధిని సాధిస్తూ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి (3.3 ట్రిలియన్ డాలర్లు) చేరిన భారత్. మరోవైపు 4 కోట్ల జనాభాతో, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో తొమ్మిదో స్థానంలో (1.9 ట్రిలియన్ డాలర్లు) ఉన్న కెనడా. రెండు దేశాల మధ్య వాణిజ్యం 8 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. ఇంచుమించు ఇరు దేశాలు 4 బిలియన్ డాలర్ల మేర ఏటా మరో దేశానికి ఎగుమతి చేస్తున్నాయి. ఈ సంబంధాలు ఇంకా బలపడాలని భారత్ ఆకాంక్షించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుందామని స్నేహహస్తం చాచింది. అయితే, ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల ఉగ్రవాది నిజ్జర్ హత్య రెండు దేశాల దౌత్య సంబంధాల మద్య చిచ్చు పెట్టింది. 

కెనడా ప్రధాని ట్రూడూ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పక్కన పెట్టేశారు. ఓ ఉగ్రవాది హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ, ఎలాంటి ఆధారాలు విడుదల చేయకుండా, అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఈ విషయంలో కెనడా అనుకున్నంత మద్దతు దక్కలేదు. ఇప్పటికైతే ఈ అంశంలో కెనడా ఏకాకిగానే మిగిలింది. కెనడా ప్రధాని ఆరోపించిన విధంగా ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల ప్రమేయాన్ని నిరూపించే సాక్ష్యాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచితే తప్ప, కెనడాకు మద్దతు లభించే అవకాశమే లేదని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయంగా ఉంది.

చైనాకు చెక్ పెట్టడానికి భారత్ సరైన శక్తిగా అమెరికా సహా పాశ్చాత్య దేశాలు భారత్ తో తమ బంధానికి తహతహలాడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా భారత్ కు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తోంది. ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఇప్పటికే తమ మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కు తెలియజేశారు. ఈ ఆరోపణల పట్ల ఆందోళన చెందుతున్నట్టు అమెరికా, ఆస్ట్రేలియా ప్రకటన చేసి ఊరుకున్నాయి. భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై తమ చర్చలు కొనసాగుతాయని బ్రిటన్ తేల్చి చెప్పింది. ఆస్ట్రేలియా ఇప్పటికే భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్ ను బహిరంగంగా విమర్శించడానికి బ్రిటన్ సంసిద్ధంగా లేదు. ఒకవైపు కెనడా అత్యంత సన్నిహిత భాగస్వామి కావడంతో ఈ విషయంలో బ్రిటన్ సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నట్టు లండన్ లోని నిపుణుడు చైతిజి బాజ్ పాయి పేర్కొన్నారు. కెనడా దర్యాప్తునకు భారత్ అధికారులు సహకరించాలని అమెరికా సూచించి ఊరుకుంది. 

నిజానికి జీ20 శిఖరాగ్ర సదస్సుకు ముందే ట్రూడూ భారత్ ను ఏకాకిని చేసే ప్రయత్నం చేశారు. తన అనుంగ మిత్ర దేశాలకు ముందే సమాచారం ఇచ్చారు. దీనిపై జీ20కి ముందు స్పందించేందుకు అమెరికా, ఇతర దేశాలు తిరస్కరించాయి. 2018లో ఇంగ్లండ్ లో రష్యా ఏజెంట్ సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియాపై విషప్రయోగంతో హత్య తర్వాత.. రష్యాపై బ్రిటన్, అమెరికా, కెనడా ఇతర దేశాలు సీరియస్ గా స్పందించాయి. 100 మందికి పైగా రష్యా దౌత్యవేత్తలను అవి బహిష్కరించాయి. నాటి ఘటనతో పోలిస్తే.. భారత్ పై కెనడా ఆరోపణలకు తగినంత మద్దతు లభించలేదనే చెప్పుకోవాలి. 

‘‘చైనాతో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్ తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. మా ఐదు కళ్ల భాగస్వామ్య దేశాలు నిజంగా ఇందులో జోక్యానికి ఇష్టపడకపోవచ్చు’’ అని వాటర్లూ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ కు చెందిన వెస్లే వార్క్ పేర్కొన్నారు. ‘‘ఇందులో వేచి చూసే ధోరణి అనుసరించొచ్చు. హత్య వెనుక భారత్ పాత్రకు సంబంధించి బలమైన ఆధారాలతో కెనడా ముందుకు వస్తే అప్పుడు మా భాగస్వాముల నుంచి మరింత మద్దతు లభించొచ్చు’’ అని వార్క్ అభిప్రాయపడ్డారు. 

‘‘బహిరంగంగా లేదా వ్యక్తిగతంగా మా మిత్ర దేశాల మద్దతు లభించకపోతే  ఈ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా కెనడా సాధించేదీ ఏదీ ఉండదు. కాకపోతే భారత్ మరో విడత ఇలాంటి చర్యకు పాల్పడకుండా నిరోధించినట్టు అవుతుంది’’ అని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ హెడ్ రిచర్డ్ ఫాడెన్ పేర్కొన్నారు. 

నిజానికి ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ఇప్పుడు ప్రకటన చేయాలని అనుకోలేదట. మరికొంత కాలం పాటు వేచి చూడాలని అనుకుంది. కొన్ని మీడియా సంస్థలు ఈ అంశాన్ని ముందే బయటపెట్టడంతో ప్రకటన చేయక తప్పలేదన్నది కెనడా ప్రభుత్వ వర్గాల వాదనగా ఉంది. మొత్తానికి ఈ దౌత్య గేమ్ ప్లాన్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సి ఉంది.


More Telugu News