హుక్కా బార్లపై నిషేధానికి కర్ణాటక ప్రభుత్వం ప్లాన్.. పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసు పెంపు

హుక్కా బార్లపై నిషేధానికి కర్ణాటక ప్రభుత్వం ప్లాన్.. పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసు పెంపు
  • పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారుతున్న యువత
  •  అడ్డుకట్ట వేసేందుకు చట్టాన్ని సవరించాలని నిర్ణయం
  • పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయం
  • స్కూళ్లు, దేవాలయాలు, మసీదులు, ఆసుపత్రుల చుట్టుపక్కల పొగాకు ఉత్పత్తుల అమ్మకం, వినియోగంపై నిషేధం విధించే యోచన
పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు హుక్కా బార్లను నిషేధించాలని, పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును 21 సంవత్సరాలకు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
పాఠశాలలు, ఆలయాలు, మసీదులు, శిశు సంరక్షణ కేంద్రాలు, ఆసుపత్రుల చుట్టుపక్కల పొగాకు వాడకం, విక్రయాన్ని నిషేధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. యువత హుక్కాబార్లకు ఆకర్షితులవుతున్నారని, ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును కూడా 18 నుంచి 21కి పెంచాలని నిర్ణయించినట్టు మంత్రి తెలపారు.

డ్రగ్స్‌కు యువత బానిసలు కావడం వల్ల వారి భవిష్యత్తు నాశనం అయిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిగరెట్ అలవాటు క్రమంగా డ్రగ్స్ వైపు తీసుకెళ్తుందని మంత్రి వివరించారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News