ఏపీ శాసనమండలిలో కూడా తీవ్ర గందరగోళం.. సభ వాయిదా
- ఉభయసభల్లో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు
- టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్
- టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ శాసనసభ సమావేశాల్లో దుమారం రేపుతోంది. ఉభయసభల్లోను టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు శాసనమండలిలో కూడా ఇదే సీన్ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో, సభను మండలి ఛైర్మన్ వాయిదా వేశారు.